Sunday, April 13, 2025

దేశవ్యాప్తంగా హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని, ప్రత్యేకించి మతపరమైన సంక్లిష్టతలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు జాగ్రత్తలు అవసరం అని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ముంబై దాడుల ప్రధాన నిందితుడు రాణాను ఇప్పుడు ఎన్‌ఐఎ తమ కస్టడీలో ఇంటరాగేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇందుకు ప్రతీకారంగా, తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాద సంస్థలు కొన్ని పనిగట్టుకుని ఫక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నట్లు నిఘా సంస్థలు పసికట్టాయి. దీనితో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేసేందుకు అంతా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని సంబంధిత భద్రతా సంస్థలకు ఆదేశాలు వెలువరించారు. అమెరికా నుంచి రాణాను ఇక్కడికి తరలించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో రాణా పాత్రను నిర్థారించుకునే విధంగా చర్యలు చేపట్టారు.అయితే పొరుగుదేశం పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ఆప్తుడిని రక్షించుకునేందుకు లేదా, ప్రతీకారంగా హింసాత్మక, వివిధ మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు వ్యూహరచన చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

ఈ ఉగ్రవాది విచారణ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. ప్రత్యేకించి పాకిస్థాన్‌లోని టెర్రర్ నెట్‌వర్క్ కార్యకలాపాల నిజరూపం బహిరంగం కానుంది. ఇది అంతర్జాతీయంగా తమకు ఇబ్బందికర పరిణామం అవుతుందని పాకిస్థాన్‌కు, అక్కడి గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకు తెలుసు. జలమార్గాల మీదుగా ముష్కరులు ఇక్కడికి చేరుకునే వీలుంది. దీనితో రేవు పట్టణాలలో హెచ్చరికలు వెలువడ్డాయి. మరో వైపు జన ప్రయాణ రవాణా సంబంధిత రైల్వే విభాగాన్ని టార్గెట్ చేసుకునేందుకు, దాడులకు దిగేందుకు కూడా వీలుంది. ఎక్కువగా జనసమ్మర్థం గల ప్రాంతాలు, సినిమా హాళ్లు, జాతరలు, సినిమా హాల్స్ కూడా ఉగ్రవాద దాడులకు లక్షాలుగా నిలుస్తాయి. సంబంధిత ఉదాహరణలు ఉన్నాయి. 2008 ముంబై దాడుల దశలో ఉగ్రవాదులు ఎక్కువగా సముద్ర మార్గాన్ని ఎంచుకునే భారతీయ భూభాగంలోకి వచ్చి, నెలల తరబడి తిష్టవేసుకుని తరువాత దాడులకు దిగారు. దీనితో ఆయా సముద్ర మార్గాలపై నిశిత నిరంతర నిఘా పెట్టారు. ఏ విధంగా కూడా టెర్రరిస్టు విషపు పురుగులు అక్రమ ప్రవేశంజరగకుండా చర్యలు తీసుకుంటారు.

ముంబై దాడులలో ఐఎస్‌ఐ కీలక పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం . తమ ఏజెంట్ వంటి రాణా ఇప్పుడు భారతీయ దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉండటంతో ఆయన ఏ విధంగా నోరు విప్పినా అది పాకిస్థాన్‌కు, ప్రత్యేకించి ఐఎస్‌ఐ మెడకు చుట్టుకుంటుంది. దీనితో విచారణ ప్రక్రియ దశలోనే తమ సత్తా చాటుకునేలా చూసుకునేందుకు రంగం సిద్దం అయింది. ఈ నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలి. జాతీయ ప్రయోజనాలు , ప్రత్యేకించి దేశ భద్రత సంబంధిత పరిణామాలపై అత్యంత జాగరూకతతో మాట్లాడాలి. స్పందించాల్సి ఉంది. ఈ బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైనా ఉందని ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు తమ సమన్వయ చర్యలను పార్టీలు రాజకీయాలకు అతీతంగా చేపట్టాలని సూచించారు. ఈ సూచనలను అంతా బాధ్యతాయుతంగా పాటిస్తారనే నమ్మకం తమకు ఉందని కూడా ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News