న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమౌతున్న పంజాబ్‌లో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, వలసలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా తయారయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో విభేదించిన ఫలితంగా కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ వచ్చినప్పటికీ నవజ్యోతి సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్‌అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగారు. సిద్ధూ పార్టీలో కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ తగిన సమాధానం చెప్పారు. తనకు పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ నేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలు తోనే ఉంటానని శనివారం స్పష్టం చేశారు.
సిద్ధూపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో ట్విటర్ ద్వారా వీటికి సమాధానం చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ కాంగ్రెస్ పార్టీపై తన విశ్వాసాన్ని వెల్లడించారు నాకు పదవి ఉన్నా లేకున్నా పార్టీలో రాహుల్. ప్రియాంకలతోనే కొనసాగుతానని చెప్పారు. నన్ను బలహీన పర్చాలని కొన్ని శక్తులు ఏ ప్రయత్నం చేసినా తాను సానుకూలంగానే ముందుకు సాగుతానని వివరించారు. పాజిటివ్ ఎనర్జీ తాలూకు ప్రతి ఔన్సు పంజాబ్‌ను ఎన్నికల్లో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ సౌభాతృత్వమే పంజాబీయత అని అందువల్ల ప్రతి పంజాబీ గెలుస్తారని పేర్కొన్నారు.