Wednesday, January 22, 2025

తలరాతను మార్చనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు?

- Advertisement -
- Advertisement -

(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ)
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు చేసే తప్పిదంతో ఆ ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. దీనివల్ల చాలామంది అభ్యర్థుల గెలుపు ఓటముల మీద ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని విస్తరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే పోస్టల్ ఓటు వినియోగించుకునే వారిలో ఎక్కువశాతం తప్పులు దొర్లుతుండడంతో వాటిపై సరైన అవగాహన పెంచుకోవాలని, మన వేసే ప్రతి ఓటు అభ్యర్థి భవిత్యవాన్ని మార్చుతుందని, మన ఓటును కచ్చితంగా తప్పులు లేకుండా వేయాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుతో ఓటు వేయించే సిబ్బంది తమ సొంత ఓటు వినియోగించుకోవడంలో తడబడకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
ఈసారి 4.50 లక్షల మంది ఉద్యోగులకు అవకాశం
ప్రస్తుతం ఈ శాసనసభ ఎన్నికల్లో సుమారు 4.50 లక్షల మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, మిలిటరీ ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉండేది. ఈసారి ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వైద్య ఆరోగ్య, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, విద్యుత్, బిఎస్‌ఎన్‌ఎల్, ఎఫ్‌సిఐ శాఖల ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఈసీ కల్పించింది.
2014లో 1148 పోస్టల్ ఓట్లలో 519 చెల్లని ఓట్లు
పోస్టల్ ఓటు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న సిబ్బంది వేస్తున్న ఓట్లు పెద్దసంఖ్యలో చెల్లట్లేదు. ఆ చెల్లని ఓట్లే చాలామంది అభ్యర్థుల గెలుపు, ఓటముల మీద ప్రభావితం చూపుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో గెలుపోటముల మధ్య తేడా కేవలం 78 ఓట్లు మాత్రమే. ఆ ఎన్నికలో 1148 పోస్టల్ ఓట్లను లెక్కించగా వాటిల్లో 519 చెల్లకుండా పోయాయి. అదే ఎన్నికలో ఎపిలోని మంగళగిరిలో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం 12 ఓట్లు మాత్రమే. అక్కడ 1051 పోస్టల్ ఓట్లు లెక్కించగా అందులో 59 ఓట్లు చెల్లలేదు. దీంతో స్వల్ప మెజారిటీతో అభ్యర్థులు ఓడిపోవడం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారి తప్పిదంగా ఎన్నికల కమిషన్ పేర్కొంటుంది.
2018 ఎన్నికల్లో 20 నియోజకవర్గాల్లో….
ఎపిలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌లో గెలుపోటముల మధ్య తేడా 25 ఓట్లు కాగా ఇక్కడ లెక్కించిన 627 పోస్టల్ ఓట్లలో 319 ఓట్లు చెల్లలేదు. 2009లో ముథోల్‌లో గెలిచిన అభ్యర్థి ఆధిక్యం 183 ఓట్లు మాత్రమే. ఆ స్థానంలో 554 పోస్టల్ ఓట్లను లెక్కించగా 454 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్రంలో 2018 ఎన్నికల్లో డోర్నకల్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఖైరతాబాద్, నిర్మల్ తదితర 20 నియోజకవర్గాల్లో చెల్లని పోస్టల్ ఓట్లు 10 శాతానికి పైగా నమోదు కావడం గమనార్హం.
డిక్లరేషన్ పత్రంపై కచ్చితంగా గెజిటెడ్ సంతకం
ఓటరు జాబితాలో ఉన్న ప్రకారం డిక్లరేషన్ పత్రంపై ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా, బ్యాలెట్ పత్రంలో ఉన్న సీరియల్ నెంబరు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏవైనా తప్పులు దొర్లితే ఆ ఓటును పరిగణించరు. డిక్లరేషన్ పత్రంపై కచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. పలువురు సిబ్బంది ఆ సంతకం లేకుండానే పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేస్తున్నారు. ఉద్యోగుల డిక్లరేషన్ పత్రాన్ని గులాబీ రంగు కవర్‌లో బ్యాలెట్ పత్రాన్ని నీలం రంగు కవర్లో అందజేస్తారు. ఓటు వేశాక ఆ పత్రాల్ని అవే కవర్లలో ఉంచి సీల్ వేయాల్సి ఉంటుంది. కొందరు తారుమారు చేస్తూ డిక్లరేషన్ పత్రాన్ని నీలం కవర్లో, బ్యాలెట్ పత్రాన్ని గులాబీ కవర్లో ఉంచి సీల్ వేస్తున్నారు. మరికొందరైతే ఆ పత్రాలకు సీల్ కూడా వేయడం లేదు. అలా వేసిన ఓట్లను తిరస్కరిస్తారు. నచ్చిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ పత్రంలో నిర్ధేశించిన గడి (బాక్స్)లోనే ‘టిక్’ మార్క్, లేదా ‘క్రాస్’ మార్క్ వేయాలి. గడి దాటి బయటకు వెళ్లిన మార్కును ఓటుగా పరిగణలోకి తీసుకోరు. మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థి గడిలో ‘టిక్’ మార్కు వేసి నచ్చని అభ్యర్థుల గడుల్లో క్రాస్’ గుర్తులు పెడుతున్నారు. ఇలాంటి పోస్టల్ ఓట్లను పరిగణించరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News