మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ,గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యుత్తమ సేవలు చేరువయ్యేందుకు పోస్టల్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 2021 పోస్టల్ శాఖ డాక్ సేవా అవార్డులను ఆయన ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఎనిమిది విభిన్న విభాగాలలో డాక్ సేవ అవార్డులు ప్రదానం చేశారు. ఉద్యోగుల నిష్కళంకమైన సేవాభావం, పనితీరు నాయకత్వ లక్షణాలు మెరుగుపర్చేందుకు డాక్ సేవా అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్ అవార్డులు పొందిన వారిని అభినందించారు. కోవిడ్ మహమ్మారి సమయాల్లో కూడా వారు అందించిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా సర్వీస్ డెలివరీలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆసరా, పెన్షన్‌లు, పట్టాదార్ పాస్‌బుక్‌లు మొదలైన వాటిని ప్రజల ఇంటి వద్ద అందించడంలో ప్రశంసనీయమన్నారు. కొమరం భీమ్, చాకలి ఇలమ్మ, రావి నారాయణ రెడ్డి, మఖ్దూమ్ మొయినుద్దీన్ మహనీయుల సేవలను గుర్తించి, ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్య్ర పోరాటంలో వారి సేవలను స్మరించుకోవడానికి ప్రత్యేక కవర్‌ని విడుదల చేయడంలో పోస్టల్ శాఖ కృషిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో టిఎం శ్రీలత, డాక్టర్ పివిఎస్ రెడ్డి, కె దేవరాజ్, రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.