చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న శాసనసభలో గవర్నర్ ప్రవర్తించిన తీరుకు నిరసనగా.. చెన్నైలోని వల్లూవర్ కొట్టాం, అన్నా సాలాయి ప్రాంతాల్లో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శాసన సభ సమావేశాల నుంచి సోమవారం వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ముద్రించి ఇచ్చిన గవర్నర్ ప్రసంగం లోని కొన్ని అంశాలను ఆయన చదవక పోవడంతో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగం మాత్రమే రికార్డుల్లో నమోదు కావాలని కోరుతూ స్టాలిన్ ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్లి పోయారు. తమిళనాడు శాసన సభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం.
ఈ ప్రసంగాన్ని ఆర్‌ఎన్ రవి చదువుతూ.. 65 వ పేరాను చదవడం మానేశారు. దీనిలో ద్రవిడార్ కళగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రులు కామరాజ్, సిఎన్ అన్నాదురై, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్‌ల గురించి ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పేర్కొన్న పేరాను కూడా గవర్నర్ చదువ లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ జోక్యం చేసుకుని, ప్రభుత్వం తయారు చేసిన గవర్నర్ ప్రసంగం మాత్రమే రికార్డులో నమోదు కావాలని ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో సభ ముగిసే ముందు వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు.
గవర్నర్, ప్రభుత్వం మధ్య సాగుతోన్న వివాదం
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వివాదం గత కొన్ని నెలల నుంచి సాగుతోంది. గవర్నర్ గత వారం మాట్లాడుతూ దేశం మొత్తానికి వర్తించేదానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రతిదానినీ చెడు అలవాటుతో తిరస్కరించే తిరోగమన రాజకీయాలు రాష్ట్రంలో ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి తమిళనాడు పేరు కన్నా తమిళగం పేరు ఎంతో తగినది అవుతుందని, అందువల్ల తమిళనాడు పేరు మార్చాలన్నారు. తమిళంలో నాడు అంటే దేశమని చెప్పారు. ద్రావిడులమని చెప్పుకుంటూ తమిళనాడులో తిరోగమన రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే మిత్ర పక్షాలు సీపీఐ, సీపీఎం, వీసీకే, కాంగ్రెస్ తదితర పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
అయితే బీజేపీ మాత్రం గవర్నర్ వ్యాఖ్యలను సమర్ధించింది. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ఈ పార్టీల ఎమ్‌ఎల్‌ఎలు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లు క్లియర్ చేయడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నట్టు ఆ పార్టీలు ఆరోపించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు డీఎంకె మిత్ర పక్షాలు ఆరోపించాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి. క్విట్ తమిళనాడు అని నినాదాలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీని తమపై రుద్ద వద్దు అని డీఎంకె ఎమ్‌ఎల్‌ఎలు నినాదాలు చేశారు.