Saturday, November 16, 2024

ఢిల్లీలో మోడీ వ్యతిరేక పోస్టర్లు.. నలుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్లుండి మోడీ హఠావో దేశ్ బచావో పోస్టర్లు గోడలపై వేలకొద్ది వెలిశాయి. దీనితో కలకలం చెలరేగింది. ఈ పోస్టర్లకు సంబంధించి స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ వైపు వెనువెంటనే అధికారులు ఈ అభ్యంతరకర పోస్టర్లను తొలిగిస్తూ ఉండగానే మరో వైపు పోలీసులు 44 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లు కూడా ఉన్నారు. ఎవరో తెలియదు కానీ వారు పోస్టర్లపై మోడీని తొలిగించాలి, దేశాన్ని రక్షించాలనే నినాదాలతో పలుచోట్ల వీటిని అతికించడం జరిగింది.

సంబంధిత పోస్టర్ల అనుమానంతో ఓ చోట ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. దీని వివరాలను రాబడుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఢిల్లీలోనే ఇటువంటి పోస్టర్లే వెలిశాయి. ఈ దశలో పలు కేసులు పెట్టారు. నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పుడు తిరిగి ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఇప్పుడు దాదాపు రెండు వేల మోడీ పోస్టర్లను తొలిగించారు. మరో రెండువేల పోస్టర్లను ముందుగానే స్వాధీనపర్చుకున్నారు.

ఈ పోస్టర్ల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రత్యేక పోలీసు కమిషనర్ దీపేంద్ర పాథక్ విలేకరులకు తెలిపారు. ఓ వ్యాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఈ పోస్టర్లను పంపిణీ చేసినట్లు తెలిసిందని , ఈ వ్యక్తుల పూర్వాపరాలను రాబడుతున్నామని వివరించారు. పోస్టర్ల వ్యాన్ ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాయలం నుంచి డిడియు మార్గ్‌లో వెళ్లుతుండగా స్వాధీనపర్చుకున్నారని అధికారులు తెలిపారు. తాను ఆప్ ప్రధాన కార్యాలయం నుంచే ఈ పోస్టర్లను తీసుకువచ్చినట్లు , వీటిని వివిధ ప్రాంతాలకు పంపించేందుకు కిరాయికి కుదుర్చుకున్నారని, ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కిన వ్యక్తి తెలిపారని, ఈ వ్యక్తి గత రెండు రోజులుగా ఈ పోస్టర్లను చేరవేస్తున్నారని తెలిసిందని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పారు. అయితే సంబంధిత విషయంపై ఆప్ వర్గాలు ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు.

రెండు ప్రింటింగ్ ప్రెస్సులకు రూ 50వేల ఆర్డర్లు
తమ ప్రాధమిక దర్యాప్తులో పోస్టర్ల కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని స్థానిక అధికారులు తెలిపారు. రెండు వేర్వేరు ప్రింటింగ్ ప్రెస్సులకు రూ 50వేల చొప్పున పోస్టర్ల ముద్రణకు ఆర్డర్లు ఇచ్చారని, వీటిని ప్రింటింగ్ ప్రెస్స్‌ల వర్కర్లు ఇతరులు రాత్రిపూటనే గోడలపై అతికించారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News