Monday, November 18, 2024

ఢిల్లీలో పోస్టర్లు

- Advertisement -
- Advertisement -

posters criticising PM Modi over vaccine shortage in delhi

 

‘ప్రధాన మంత్రిగారూ! మన పిల్లలకు ఉద్దేశించిన టీకాలను విదేశాలకు పంపించడం న్యాయమా?’ అని అడిగినందుకు ఢిల్లీ పోలీసులు అనేక మంది ఆప్ కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు పెట్టారన్న సమాచారం వింత అనిపించదు. ప్రశ్నను బొత్తిగా సహించడం ఎరుగని కేంద్ర పాలకులు చీటికీ మాటికీ పోలీసులను, అరెస్టులను ఆశ్రయించడం ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించదు. తాను వేసుకున్న లాగు చిరగకూడని చోట చిరిగినందుకు బాధపడకుండా, ఆ విషయాన్ని వేలెత్తి చూపిన వారి పట్ల ఉక్రోషం ప్రదర్శించిన బాలుడిలా ఉంది ప్రధాని మోడీ ప్రభుత్వ వాలకం. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అయినా అక్కడి శాంతి భద్రతల రక్షణ వ్యవస్థ (పోలీసులు) కేంద్ర హోం శాఖ ఆధీనంలోనే ఉంటుంది. ఢిల్లీ మహా నగరంలో లాక్‌డౌన్ అమలును పర్యవేక్షిస్తున్న సమయంలో అక్కడి గోడలపై ఈ పోస్టర్లు కనిపించడంతో పోలీసులు ఆగ్రహం చెంది ఆరా తీయగా వాటిని అతికింప చేసింది ఒక ‘ఆప్’ నాయకుడని తేలడంతో ఈ అరెస్టులకు పాల్పడ్డారు. ఈ పోస్టర్ల వెనుక విషయాన్ని లోతుగా పరిశీలిస్తే కొవిడ్ సెకండ్ వేవ్ పై కేంద్ర ప్రభుత్వం వహించిన ప్రమత్తత, నిర్లక్షం నిలువెత్తున దర్శనమిస్తాయి.

ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ రక్షకుడిగా చూపించడానికి వ్యాక్సిన్లను విదేశాలకు పంపించిన ధోరణి కళ్లకు కడుతుంది. గత జనవరిలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల తయారీ మొదలవుతున్న సమయంలో ప్రవాసీ భారతీయ దినాన్ని వీడియో సదస్సు ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. భారతీయ టీకాలతో ప్రపంచాన్ని ఆదుకునే స్థితిలో ఇండియా నేడున్నదని అప్పటి తన ప్రసంగంలో ఆయన ప్రకటించారు. రెండు భారతీయ టీకాల డోసులను సరఫరా చేయడం ద్వారా మొత్తం మానవాళిని కొవిడ్ నుంచి కాపాడడానికి ఇండియా సిద్ధంగా ఉందని అభయమిచ్చారు. అప్పటికింకా దేశంలో సెకండ్ వేవ్ విజృంభించలేదు. కాని అది దేశాన్ని కకావికలు చేయడం ఖాయమనే హెచ్చరికలు ఇంచుమించు అదే దశలో వెలువడడం ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన శాస్త్ర విజ్ఞాన సలహాదారుల బృందమే ఈ హెచ్చరిక చేసింది. భారతీయ సార్స్ కొవ్.

2 జెనెటిక్స్ కన్సార్టియం ఇన్‌శా కాగ్ అనే ఈ బృందం దేశానికి పొంచి ఉన్న బి.1.617 వేరియంట్ ప్రమాదం గురించి కనిపెట్టినట్టు స్పష్టపడుతున్నది. వారు మార్చి 10 తేదీ లోగానే దాని గురించి కేంద్రానికి స్పష్టమైన హెచ్చరిక చేశారు. అది చాలా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే గత సెప్టెంబర్‌లో రోజుకి 93 వేలుగా రికార్డయిన కొవిడ్ కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పది వేలకు పడిపోడంతో భరోసా పెంచుకొని ఆ హెచ్చరికను మన పాలకులు ఖాతరు చేయలేదు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలు కావడం, ఇతర దేశాల్లో ఆ కృషి అప్పటి ఇంకా ఫలప్రదం కాకపోడంతో దానిని ప్రధాని మోడీ గొప్పతనం ప్రచారం కోసం వినియోగించాలనుకున్నారు. మానవాళికి ఇండియా మహా రక్షకురాలు కానున్నదనే పలుకులు ఆ నేపథ్యంలోనే ప్రధాని నోట వెలువడ్డాయి. వ్యాక్సిన్ మైత్రి పేరిట జనవరి నుంచే విదేశాలకు టీకా డోసులను పంపించడం ప్రారంభించారు. దానితో అంతర్జాతీయ సహకారం అంటే ఏమిటో మోడీ వద్ద నేర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మార్చి మాసారంభంలోనే శ్లాఘించారు.

ఇంకొక వైపు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తెర లేవడం, వరుస భారీ ప్రచార సభలు ఊపందుకోడం, కుంభమేళా నిరాటంకంగా సాగిపోడం జరిగాయి. వాస్తవానికి ఏ ప్రజా కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య విధి విధానాన్ని ఆపకుండానే తగిన ముందు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్, ఆక్సిజన్ నిల్వల పట్ల శ్రద్ధ వహించి ఉంటే ఇప్పుడీ ప్రమాదం ఇంతగా ముంచుకొచ్చేది కాదు. కేవలం ప్రధాని మోడీ ప్రతిష్ఠను అంతర్జాతీయ గగనాల్లో రెపరెపలాడించే లక్షంతో జనవరి 20న విదేశాలకు టీకా ఎగుమతి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 95 విదేశీ సంస్థలకు 6.6 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేసిందని సమాచారం. ఇందులో 1.06 కోట్ల డోసులను పేద దేశాలకు ఉచితంగా పంపించిందని గణాంకాలు చెబుతున్నాయి.

దేశమంతటా కొవిడ్‌కు లెక్కకు మించినంత మంది బలైపోతున్న, సెకండ్ డోసు వ్యాక్సిన్‌కు కూడా తీవ్రమైన కొరత ఎదుర్కొంటున్న ఈ దశలో, ప్రేతకళ ఆవహించిన ఢిల్లీ నగరంలోని ప్రజలకు వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవకతవకల మీద ఆగ్రహం వస్తే తప్పుపట్టవలసిందేమీ లేదు. దాని పర్యవసానమే దేశ రాజధానిలో గోడలను అలంకరించిన పోస్టర్లు. ప్రధాని ఏమైనా చేయొచ్చు గాని ఆయనను ఎవరూ ప్రశ్నించరాదని, నోరెత్తితే అరెస్టు చేసి జైల్లో తోస్తామనే విధానం ఏ ప్రజాస్వామ్య నియమాలకు అనుకూలమో అర్థం కావడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News