వరదలతో జనం ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదు
మల్కాజిగిరి నియోజకవర్గంలో గోడలపై వెలసిన పోస్టర్లు
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి కనిపించడంలేదని నగరంలో వాల్ పోస్టర్లు వెలిశాయి. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పలుచోట్ల గోడలపై అతికించిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 2020లో నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తినప్పుడు నియోజకవర్గంలో సందర్శించలేదని, ఇప్పుడు కూడా వరద బాధితులను పరామర్శించడానికి రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వారం రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిపై తెలంగాణ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రతిపక్ష నేతలు ఆందోళనలు, విమర్శలు మానుకుని ప్రజలకు సాయం చేయాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి కనిపించడంలేదంటూ పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్ గా మారింది. ఓ ఎంపీగా ఎప్పుడైనా నియోజకవర్గంలో పర్యటించారా అంటూ పోస్టర్లలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ పోస్టర్ల వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.