Monday, December 23, 2024

ఐఐటి ముంబైలో వెజ్ నాన్‌వెజ్ రగడ

- Advertisement -
- Advertisement -

ముంబై : స్థానిక ప్రఖ్యాత విద్యాసంస్థ ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి(ఐఐటిబి)లో ఆహార వివక్ష ప్రదర్శితం కావడం వివాదాస్పదం అయింది. వెజ్ నాన్‌వెజ్ వివాదం పోస్టర్ల స్థాయికి చేరింది. గతవారం మాంసాహారం తింటున్న ఓ విద్యార్థిని మరో విద్యార్థి తిట్టిపోశాడు. ఇప్పుడు క్యాంపస్ హాస్టళ్లలోని మెస్‌లలో ఓన్లీ వెజిటేరియన్ పోస్టర్లు అతికించి ఉంచడం మరింత రగడకు దారితీసింది. విద్యాసంస్థలోని ఓ హాస్టల్‌లోని క్యాంటిన్‌లోని గోడలపై అక్కడక్కడ శాకాహారులకు మాత్రమే అనే పోస్టర్లు వెలువడ్డాయి. ఈ విషయాన్ని విద్యార్థి ప్రతినిధి ఒక్కరు ఆదివారం తెలిపారు. క్యాంటిన్ మెస్సుల్లో విద్యార్థులను శాకాహారులు, మాంసాహారులుగా వేర్వేరుగా చూడటం వివక్ష కిందికి వస్తుందని పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

హాస్టల్ నెంబరు 12లోని క్యాంటిన్‌లో నిర్ణీత ప్రదేశంలో ఇక్కడ కేవలం శాకాహారులే కూర్చోవల్సి ఉంటుందనే తాటికాయలంత అక్షరాలతో కూడిన పోస్టర్లు కన్పించాయి. వీటిని కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పెట్టారు. దీనితో తిండితేడాల గొడవ బయలుదేరింది. అయితే తమకు ఈ పోస్టర్ల గురించి ఇతరుల వల్లనే తెలిసిందని, తాము ఇటువంటి పోస్టర్లను పెట్టలైదని క్యాంటిన్ల అధికారులు తేల్చిచెప్పారు. అయినా హాస్టల్ భోజనశాలల్లో మాంసాహారులు, శాకాహారులకు వేర్వేరు ప్రదేశాలు లేవని, ఇటువంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. అయితే ఎవరో కావాలనే ఈ పోస్టర్లను అతికించి ఉంటారని, వీటి గురించి తెలియగానే తీసేశామని వివరించారు. ఈ పోస్టర్లపై కలెక్టివ్ అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ (ఎపిపిఎస్‌సి) మండిపడింది. వీరు కూడా పోస్టర్లను చింపివేశారు. అట్టడుగు వర్గాలు, కొన్ని కులాలకు చెందిన విద్యార్థులను కించపరిచేందుకు, తమ ఆధిపత్యం చాటుకునేందుకే అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఈ ఆకతాయి ఆధిపత్య ధోరణికి దిగారని ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు శాకాహార ప్రియులు ప్రత్యేకంగా తాము భోజనం చేసేందుకు ప్రత్యేక ప్రదేశం కోసం ఇటువంటి పోస్టర్లను వెలువరించి ఉంటారని ఈ సర్కిల్ పలు అంశాలను నిర్థారించుకుని తెలిపింది. శాకాహారులకు సంబంధించి ప్రత్యేకంగా ఆహారం అందుకునేందుకు జైన్ కౌంటర్ ఉందని, అయితే భోజనం చేసేందుకు వీరికి ప్రత్యేక ప్రాంతం ఏర్పాట్లు లేవని హాస్టల్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. విద్యాసంస్థల్లో తిండి , భోజనాల విషయంలో ఇటువంటి ధోరణిని తాము సహించేది లేదని, ఇక ముందు ఇటువంటివి జరగకుండా చూస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News