ఇండియా కూటమిలో పెద్ద పాత్రకు డిమాండ్
పాట్నా: జాతీయ రాజకీయాలలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మరింత పెద్ద పాత్ర ఇవ్వాలని కోరుతూ రాజధాని నగర వ్యాప్తంగా మంగళవారం పోస్టర్లు వేశాయి. ఢిల్లీలో మంగళవారం జరగనున్న ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొనేందుకు నితీశ్ కుమార్ ఢిల్లీ వెళ్లిన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే పోస్టర్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని నితీశ్ సారథ్యంలోని జెడి(యు) వెంటనే వివరణ ఇచ్చింది. సొంత ప్రయోజనాలను ఆశించకుండా ప్రతిపక్ష ఐక్యత కోసమే తాను కృషి చేస్తున్నానని నితీశ్ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పోస్టర్ల వల్ల తమ నాయకుడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని జెడి(యు) ఆందోళన చెందుతోంది. జెడి(యు)తో కలసి రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆర్‌జెడి మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ ప్రధాన లక్షమని స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియలో ప్రధాన మంత్రి తమ ముఖ్యమంత్రి(నితీశ్ కుమార్)కి దక్కిన పక్షంలో అది బీహార్‌కే గర్వకారణమని ఆర్‌జెడి తెలిపింది. కాగా..పోస్టర్లు వేసింది ఎవరో కచ్ఛితంగా తెలియరానప్పటికీ అందులో పేర్కొన్న సంకల్పం(నిశ్చయ్) అన్న పదాన్ని మాత్రం తప్పు పట్టడానికి లేదని జెడి(యు) అధికార ప్రతినిధి, ఎంఎల్‌సి నీరజ్ కుమార్ తెలిపారు. నితీశ్ కుమార్ రెండు ఫోటోలతో ముద్రించినా పోస్టర్లలో విజయం సిద్ధించాలంటే సంకల్పం(నిశ్చయ్) ఉండాలి అని హిందీలో రాసి ఉంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏడు సంకల్పాలు(ఏడు నిశ్చయాలు)లను ప్రధానంగా ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి విజయం సాధించింది.
మళ్లీ నిశ్చయ్ అన్న పదం ఇప్పుడు పోస్టర్లలో కనిపించడంతో ఈ పోస్టర్ల వెనుక ఎవరు ఉన్నారన్న విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఏర్పడిపోయింది. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను నితీశ్ కుమార్‌కే అప్పగించాలని జెడి(యు) కోరుకోవడమే గాక ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగిస్తోంది. కూటమిలో అత్యంత సీనియర్ నాయకుడైన నితీశ్‌కు మాత్రమే అన్ని పక్షాలను కూడగట్టుకుని ముందుకు సాగగల సామధ్యం ఉందని జెడి(యు) భావిస్తోంది. గత ఏడాది జూన్‌లో పాట్నాలో ఇండియా కూటమి తొలి సమావేశాన్ని నితీశ్ నిర్వహించారు. ఆ తర్వాతి సమావేశం బెంగళూరులో కొద్ది నెలల తర్వాత జరిగింది.