గాంధీభవన్ వద్ద మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్‌ల కలకలం
మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్, గోబ్యాక్ టు నిజామాబాద్, పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారు చేసేందుకు టిపిసిసి ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ ఆశావహులు వివిధ రూపాల్లో తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్ వద్ద పోస్టర్లు వెలిశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్ గోడలపై పోస్టర్లు అంటించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి
ఈ పోస్టర్లపై మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల సంగతి తెలుస్తానని మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో తనకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల వెనకాల ఎల్బీనగర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఓడిపోతానన్న భయంతోనే తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి ఎంగిలి మెతుకులకు కూడా ఆశ పడే వాళ్లు ఉంటారని అలాంటి వ్యక్తులే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.