ఆమ్రపాలికి టూరిజం ఎండీగా కీలక బాధ్యతలు
కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా వాకాణి కరుణ
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణిమోహన్
మన తెలంగాణ / అమరావతి : తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆదివారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలికి పోస్టింగ్‌తో పాటు టూరిజం అథారిటీ సిఈఓగా అదనపు బాధ్యతలు కేటాయించారు. అంతేకాకుండా కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా వాకాణి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణిమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు.
మరో ఐఎఎస్ అధికారి రొనాల్డ్ రోస్‌కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. కాగా డీఓపీటీ ఆదేశాల మేరకు ఇటీవలే ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ వాణిప్రసాద్ రిపోర్టు చేశారు. మరోవైపు ఏపీ నుంచి రిలీవ్ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. అంతకుముందు ఏపీకి వెళ్లేందుకు నలుగురు అధికారులూ నిరాకరించారు. తెలంగాణలోనే కొనసాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఏపీలో రిపోర్టు చేశారు.