న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో 21 ఏళ్లపాటు పోస్ట్‌మ్యాన్‌గా సేవలందించిన రామ్‌శరణ్ మంగళవారం రిటైర్ అవుతున్నారు. చివరిసారిగా ఆయన శుక్రవారం(ఆగస్టు 27న) విధులు నిర్వహించారు. సోమవారం జన్మాష్టమి కాకపోయివుంటే అదే ఆయన విధి నిర్వహణకు చివరిరోజు అయి ఉండేది. తనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం వల్లే పార్లమెంట్‌లో 21 ఏళ్లపాటు పోస్ట్‌మ్యాన్‌గా కొనసాగానని రామ్‌శరణ్ అన్నారు. సాధారణ ఉద్యోగుల నుంచి కేంద్ర మంత్రుల వరకు తన సేవల్ని ఒకేరీతిన అందించానని ఆయన అన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా ఉద్యోగానికి ఇబ్బంది ఏర్పడుతుందన్న ఆందోళనతో పార్లమెంట్‌లో పని చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరని ఆయన తెలిపారు. 2000 సంవత్సరంలో తనను అక్కడికి బదిలీ చేసినపుడు కొన్నిరోజులపాటు ఆందోళనకు గురయ్యానని ఆయన తెలిపారు. అక్కడి గదులు, దారులు ఒకే తీరున కనిపిస్తాయని, దాంతో ఎవరైనా అయోమయానికి గురవుతారని ఆయన గుర్తు చేశారు. 1989లో పోస్టల్‌శాఖలో చేరడానికి ముందు 1981 నుంచి 1989 వరకు రైల్వే మెయిల్ సర్వీస్‌లో పని చేసినట్టు రామ్‌శరణ్ తెలిపారు. రామ్‌శరణ్‌కిపుడు 60 ఏళ్లు.