Monday, November 18, 2024

పోస్ట్‌మాస్టర్ ఘరానా మోసం.. రూ. 1.25 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు స్వాహా

- Advertisement -
- Advertisement -

Postmaster Spends Rs 1.25 crore of depositors in IPL

డిపాజిటర్ల సొమ్ముతో ఐపిఎల్ బెట్టింగులు
రూ. 1.25 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు స్వాహా
మధ్యప్రదేశ్‌లో పోస్ట్‌మాస్టర్ ఘరానా మోసం

సాగర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఒక సబ్ పోస్ట్‌మాస్టర్ ఐపిఎల్ బెట్టింగుల కోసం డిపాజిటర్ల సొమ్ము రూ. 1.25 కోట్లు ఖర్చు చేశాడు. ఇక్కడి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సబ్ పోస్టాఫీసులో సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న విశాల్ అహిర్వార్(36)ను ఈ నెల 20న అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ ధుర్వే బుధవారం తెలిపారు. తమ ఫిక్సెడ్ డిపాజిట్ల(ఎఫ్‌డి) కాలపరమితి తీరడంతో డబ్బు వాపసు కోసం కొందరు డిపాజిటర్లు ఈ నెల మొదట్లో సబ్ పోస్టాఫీసుకు వెళ్లినపుడు ఈ వ్యవహారం బయటపడిందని ఆయన చెప్పారు. తమ ఫిక్సెడ్ డిపాజిట్ నంబర్లు కాని అకౌంట్ నంబర్లు కాని రికార్డులలో లేవని, తమ పేర్ల మీద ఎఫ్‌డిలే లేవని పోస్టాఫీసు సిబ్బంది తెలియచేయడంతో డిపాజిట్లు నివ్వెరపోయారు. తమ ఎఫ్‌డిల గురించి వాకబు చేసేందుకు వారు ప్రతి రోజు పోస్టాఫీసుకు వెళ్లేవారు. మీ సొమ్మును రెట్టింపు చేసేందుకు సబ్ పోస్ట్ మాస్టరే ఐపిఎల్ బెట్టింగులో ఎఫ్‌డి సొమ్ము పెట్టాడని అక్కడి సిబ్బంది చెప్పడంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 20న అరెస్టు చేశారు.

డిపాజిటర్ల సొమ్మును తాను ఐపిఎల్ బెట్టింగ్ రాకెట్ యాప్‌లో పెట్టానని, శీఘ్రంగా, అధిక మొత్తం లభిస్తుందన్న నమ్మకంతోనే తాను ఈ పనిచేశానని అహిర్వార్ చెప్పినట్లు ధుర్వే తెలిపారు. కొవిడ్ కాలంలో తన భర్తను, మామగారిని కోల్పోయిన వర్ష అనే మహిళ పోస్టాఫీసులో రూ.9 లక్షలు డిపాజిట్ చేశారని మరో అధికారి తెలిపారు. తన నలుగురు కుమార్తెల పెళ్లిళ్ల కోసం కిషోరీ బాయి అనే మహిళ పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేశారని, ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయారని ఆ అధికారి చెప్పారు. పరమానంద్ సాహు అనే సీనియర్ సిటిజన్ తన రిటైర్‌మెంట్ బెనిఫిట్ సొమ్ము మొత్తాన్ని తెచ్చి పోస్టాఫీసులో డిపాజిట్ చేసి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక రోడ్డునపడ్డారని ఆయన చెప్పారు. దాదాపు 20 మంది బాధితులకు చెందిన దాదాపు రూ. 1.25 కోట్ల డిపాజిట్లను తాను స్వాహా చేసినట్లు అహిర్వార్ ఒప్పుకున్నాడని ధుర్వే చెప్పారు.

Postmaster Spends Rs 1.25 crore of depositors in IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News