మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతవిద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైద్య కశాలలకు మినహా విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా వేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఈ నెల 30 వరకు ప్రాక్టికల్స్, రాత, మిడ్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని వర్సిటీలకు ఉన్నతావిద్యామండలి తెలిపింది. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్, శాతవాహన, అంబేడ్కర్ యూనివర్సిటీలు వివిధ పరీక్షలను వాయిదా వేశాయి. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు వర్సిటీలు వెల్లడించాయి. సెలవుల్లో పరీక్షలను నిర్వహిస్తే.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ప్రైవేట్ కళాశాలలకు జెఎన్‌టియుహెచ్ స్పష్టం చేసింది. ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్ వర్సిటీలు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగిస్తున్నాయి.