ప్రియాంక గాంధీ అందుబాటులో లేకపోవడంతో
ఖరారు కానీ షెడ్యూల్
ఈనెలాఖరులోగా మరోసారి సభ తేదీని ప్రకటించే అవకాశం
నిరుత్సాహాంలో కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకులు
హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ‘పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభ’ వాయిదా పడినట్టుగా తెలిసింది. ప్రియాంక గాంధీ విదేశీ పర్యటనలో ఉండడం, ఆమె ఇండియా తిరిగి రాకపోవడంతో కొల్లాపూర్ షెడ్యూల్ ఖరారు కాలేదని ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేసినట్టుగా సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి పాలమూరు సభకు ఆహ్వానిస్తూ ఈ నెల మొదటి వారంలోనే టిపిసిసి లేఖ రాసింది. ప్రస్తుతం ఆమె షెడ్యూల్ అందుబాటులో లేకపోవడంతో ఈ సభ వాయిదా పడిందని, ఈ నెల 20వ తేదీన నిర్వహించాల్సిన సభను ఈనెలాఖరులోగా నిర్వహించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో చేరాలనుకునే వివిధ పార్టీల నాయకులు నిరుత్సాహాం చెందుతున్నారు.
ఈ నెల 23 లేదా 28 లేదా 30వ తేదీల్లో…
ఈ సభకు సంబంధించి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో ఓ కమిటీని పిసిసి వేసింది. అదేవిధంగా సభ నిర్వహణతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు ఇన్‌చార్జీలను సైతం నియమించింది.
ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడినట్లు ఏఐసిసి నుంచి పిసిసికి, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 23వ తేదీన కానీ, 28న కానీ, 30వ తేదీన కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఏఐసిసి సూచించినట్లు సమాచారం. అప్పటికీ ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు కాకపోతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.