Sunday, December 22, 2024

‘స్వేద పత్రం’ విడుదల వాయిదా

- Advertisement -
- Advertisement -

నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా స్వేదపత్రంపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ భవన్ వేదికగా బిఆర్‌ఎస్ విడుదల చేయనున్న స్వేదపత్రం కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది. మొదటగా శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని భావించగా, వివిధ కారణాల రీత్యా ఒకరోజు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక, విద్యుత్ రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అందుకు పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం ఉదయం 11 గంటలకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

స్వయం పాలన ప్రారంభమైన తొమ్మిదిన్నరేళ్ల అనతి కాలంలోనే కెసిఆర్ ప్రభుత్వ దార్శనికతతో, యావత్ తెలంగాణ ప్రజలు చెమటోడ్చి సృష్టించిన సంపదపై స్వేదపత్రం విడుదల చేయనున్నట్లు బిఆర్‌ఎస్ పేర్కొంది. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని తెలిపింది. పగలూ, రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించబోమని కెటిఆర్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమని, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేశారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించనున్నట్లు కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు ఒనగూరిన లబ్ది, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ఇదే సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన మార్పు వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News