మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంట ర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేస్తూ బోర్డు కీల క నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం 7 నుంచి 20 వరకూ ప్రాక్టికల్స్ జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పబ్లిక్ పరీక్షల తర్వాతే ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో థియరీ పరీక్షల తర్వాత మే 29నుంచి జూన్ 7 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.
కాగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు మూసివేస్తూ విద్యాశాఖ కొద్ది రోజుల కింద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల నిర్వాహణపై విద్యార్థులు, వారి తల్లదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పటికే ఫీజులు కట్టేశారు. చివరి నిమిషంలో కరోనా కారణంగా ప్రాక్టికల్స్ వాయిదా వేసిన నేపథ్యంలో, థియరీ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు నెలకొన్నాయి.