సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
మన తెలంగాణ / హైదరాబాద్: కాలజ్ఞాని , దార్శనికుడు, తత్వవేత్త, సంఘసంస్కర్తగా నిలిచిన పోతులూరి వీరబ్రహ్మం సర్వమత సమానత్వాన్ని ప్రతిష్ఠించిన మహాప్రవక్త అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 415 వ జయంతి మహోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి జూలూరు గౌరీశంకర్ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన విశ్వకర్మలను ఉద్దేశించి మాట్లాడుతూ దూదేకుల సిద్ధయ్య , మాదిగ కక్కడు నుంచి సబ్బండ వర్ణాలను ఏకం చేసి సమభావాలను ప్రజల మనస్సుల్లో నాటిన మహనీయుడు పోతులూరి అన్నారు. పోతులూరి తన రచనల ద్వారా సామాజిక విప్లవాన్ని సృష్టించారన్నారు. మూఢవిశ్వాసాలపై ధ్వజమెత్తి మానవాళికి జ్ఙానోదయాన్న కలిగించారని జూలూరు పేర్కొన్నారు. కులమత వర్గ వర్ణాలకు అతీతంగా ఆయన కాలజ్ఙానాన్ని ప్రబోధించారన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విశ్వకర్మీయుల సహకారంతో పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఙాన ఉపన్యాసాలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు.
వీరబ్రహ్మం కాలజ్ఙానాన్ని ఈ తరం లోతుగా చదువుకుంటే సమాజంలో సమానత్వం ఎంతో బలంగా ప్రతిష్ఠించబడుతుందన్నారు. కులమత ఆధిపత్య తత్వాలను తిప్పికొట్టేందుకు కాలజ్ఙానం జ్ఙాన ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. సమభావం, సమరాజ్యాన్ని కోరుకున్న పోతులూరి రచనలను ముద్రించి విస్తృతంగా అన్ని వర్గాలకు అందించవలసిన బాధ్యతను నిర్వర్తిస్తామని జూలూరు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ విశ్వకర్మీయుడు తంగెళ్ళపల్లి రమేష్, బ్రిటన్‌లో స్థిరపడ్డ పాలస గురుమూర్తి, విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షుడు అడ్లూరి రవీంద్రాచారి, సంకోజు రాఘవేందర్, కన్నెగంటి వెంకటరమణ, చింతోజు మాధవరావు, కొలనూరు శ్రీనివాసాచారి, తాడూరి శ్రీనివాసాచారి, డా. నరేందర్, అన్నభీమోజు జితేందర్, రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.