Monday, December 23, 2024

పోటెత్తిన ఎర్రదండు… ఎర్రబారిన నల్ల బొగ్గు కేంద్రం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : ఎర్రదండు కదం తొక్కింది. ఎర్రని జెండాలతో సింగరేణి నల్లని బొగ్గు కేంద్రం ఎరుపెక్కింది. ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పట్టణంలో జరిగిన సిపిఐ ప్రజా గర్జన సభతో కొత్తగూడెం పట్టణం దద్దరల్లింది. ఎర్ర చొక్కా, ఎర్ర చీర, చేతిలో ఎర్రజెండాతో సిపిఐ కార్యకర్తలు కొత్తగూడెంకు భారీగా కదలివచ్చారు. ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే. దారులన్నీ జనంతో నిండిపోయాయి. కార్యకర్తల నినాదాలతో గూడెం పట్టణం ప్రతిధ్వనించింది. వందల సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. గ్రామగ్రామం నుంచి తమ గ్రామానికి చెందిన ఫ్లక్సీలు చేతబూని ప్రకాశం స్టేడియంకు చేరుకున్నారు.

సూర్యుని భగభగలు సైతం లేక్కచేయకుండా దండుగా తరలివచ్చారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో ఎండతీవ్రత మరి కాస్త ఎక్కువే ఐనప్పటికీ కార్యకర్తల సంకల్ప బలం ముందు సూర్యుని భగభగలు చిన్నబోయాయి. మారుమూల ప్రాంతాల నుండి ఆదివాసీలు, గిరిజనులు మండుటెండలో నాలుగు గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రజాగర్జన సభకు యువకెరటం కదిలివచ్చింది. ఎటు చూసినా యువకులే కనిపించారు. పదివేలమంది రెడ్ షర్ట్ వలంటీర్లు కదం తొక్కారు. ఎర్రచీరలు ధరించిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ జనసమీకరణ జరగగా సిపిఐ కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చారు.

ప్రధానంగా ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి వేలాది మంది రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో ప్రజాగర్జనకు తరలివచ్చారు. ప్రస్తుత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎంపిపిగా ఉన్నప్పుడు పోలీసులు ఆయనపై టాడా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. టాడా కేసు నమోదు చేయడాన్ని నిరశిస్తూ సిపిఐ నిర్వహించిన బహిరంగ సభకు రికార్డు స్థాయిలో జనం హాజరయ్యారు. ఆ తర్వాత అదే రీతిలో ఆదివారం కొత్తగూడెం సిపిఐ బహిరంగ సభకు జనం తరలివచ్చారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. మరో ప్రక్క భవిష్యత్ ప్రజాపోరాటాలకు దిశానిర్దేశం చేసే విధంగా ఏర్పాటు చేసిన ఈ సభ లక్ష్యాన్ని సిపిఐ చేరుకుందని చెప్పొచ్చు.

లెక్కలతో రాజకీయ జఖ్యత సాధ్యం కాదని, పరస్పర సహకారం అన్నింటికీ మించి అవగాహన ముఖ్యమని సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కే. నారాయణ తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలోనే బిఆర్‌ఎస్ కు మద్దతు పలికామని, ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసిఆరే దే నని ఆయన అన్నారు. ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ప్రజాగర్జన పేరిట జరిగిన బహిరంగ సభ కు సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన వహించారు ఈ సభలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ వీరోచిత పాత్ర పోషించిందన్నారు. సిపిఐ తెలంగాణసాయుధ పోరాటం లేకుండా అసలు తెలంగాణ ప్రాంతం దేశంలో ఉండేది కాదని, సిపిఐ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని నారాయణ తెలిపారు.

11 లక్షల ఎకరాలు పోడుభూములకు పట్టాలివ్వాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 4000 ఎకరాలకే ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిపిఐ ఎన్నికల కోసమే సభ ఏర్పాటు చేసిందని అంటున్నారని, ఎన్నికల్లోకి పోకుండా ఉండేందుకు తామేమి సన్యాసం తీసుకోలేవన్నారు. సీట్లు అడగడం తమ రాజకీయ హక్కని నారాయణ స్పష్టం చేశారు. విజేపీ విధానాలు ప్రాంతానికో తీరుగా ఉంటాయని, బిజేపికి కట్టుబానిసగా ఉన్న జగన్ ను ఇప్పుడు ఎందుకు తిట్టిపోస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. కర్నాటకలో సందుల్లో గొందుల్లో బిజేపీ నేతల తిరిగినప్పటికీ ఫలితం రాలేదని, ఇప్పుడు మోడి, అమీత్ షా, నడ్డా తెలంగాణ చుట్టు తిరుగుతున్నారని, తెలంగాణలో బిజెపికి అంత సీన్ లేదన్నారు. 2014లో రూ.400 గ్యాస్ ధర ఉంటే, గ్యాస్ బండ చూసి మహిళలు తనకు ఓటేయాలని చెప్పిన మోడి ఇప్పుడు రూ.3150 ధర పెరిగిందని, దీనికి మోడీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

పప్పు, ఉప్పు, మిరపకాయలతో సహా నిత్యవసరాల ధరలు భారీగా పెరిగాయని, ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. సంపన్న వర్గాల వారికి 32 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించి, పేదల నుంచి రూ.1.5 లక్షల కోట్లు జిఎస్టి పేరుతో దోచుకున్నారని నారాయణ తెలిపారు. ఆధానీ మోడీ కవల పిల్లలని, వీరద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. మోడీ రాష్ట్రపతిని పిలువకుండా ఎందుకు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారని, దానికి సహేతుకమైన కారణం చెప్పగలరా అని నూటి ప్రశ్న వేశారు.

పోరాటాలకు ఓనమాలు నేర్పిందే కమ్యూనిస్టులని, వారి పోరాటాలు లేకుండా ఈదేశంలో ఏసమస్య కుడా పరిష్కారం కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ నేల పునీతమైందన్నారు. కమ్యూనిస్టులపై విమర్శలు కొత్తేమీ కాదని, మదినిండా గాయాలతోనే కమ్యూనిస్టు పార్టీ ఎదిగిందని, ఏసి గదుల్లో కూర్చుని కొందరు కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు లేకుండా ఇప్పటి తెలంగాణ సాధ్యమయ్యేదా అని, అసలువారి పోరాటమే లేకుంటే నాలుగున్నర వేల మంది అమరులు బలిదానాలు లేకుండా తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. వందేళ్లయినా కమ్యూనిస్టులు నవ యవ్వనంతో పోరాడుతున్నారని, కొత్తగూడెం బహిరంగ సభే ఇందుకు సాక్షం అన్నారు.

కమ్యూనిస్టులకు మాత్రం తొలి నుండి తుదిదాగా బిజెపినే ప్రథమ శత్రువన్నారు. బండి సంజయ్ లాంటి వ్యక్తులు సిగ్గులేకుండా ఉపన్యాసాలు చేస్తున్నారని, అవకాశ వాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరన్నారు. పార్టీలు మారే అడ్డమైన గాడిదలు కమ్యూనిస్టులకు నీతులు చెబుతున్నారని, విమర్శించడం ఒక ఫ్యాషన్ మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. అర్హత గల ప్రతీ పోడురైతుకు పట్టా ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సింగరేణి ప్రైవేటీ కరణను నిలుపుదల చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీని అమలు చేయాలని, సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించాలని, నిరుద్యోగ బృతిని అమలు చేయాలని చెప్పారు.

ఈ సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, మాజీ శాసన సభ్యులు పల్లా వెంకటరెడ్డి, గిరిజన నేత మనీష్ కుంజాం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంత రావు, పశ్య పద్మ, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఇటి నర్సింహం, సీతారామయ్య, కలివేని శంకర్, బాల ముల్లేష్, బాల నర్సింహా, పోటు ప్రసాద్, ఎ.సాబీర్ అలీ, అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్, మహ్మద్ మౌలాన, దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News