Saturday, December 21, 2024

మానవ హక్కుల రక్షణ మార్గం

- Advertisement -
- Advertisement -

ప్రతి దేశం శతాబ్దాల నుండి సొంత చరిత్రతో, సంస్థలతో, సంప్రదాయాలతో, జీవన మార్గాలతో, తాత్వికతలతో పరిణామం చెందింది. ప్రపంచ దేశాల మధ్యజ్ఞాన మార్పిడి వంటి నిరంతర పద్ధతుల ద్వారా ఈ పరిణామం సాధ్యపడింది. అయినా ప్రతి దేశం తనలక్షణాలతోనే అభివృద్ధి చెందింది. ఒకరి నుండి మరొకరు తెలుసుకోడమనే ధారావాహిక ప్రక్రియ సమాజాల అభివృద్ధికి, సశక్తీకరణకు ఉపకరించింది. సమాజాలుకొత్త విషయాలను గ్రహించి, సొంత లక్షణాలను నిలబెట్టుకున్నాయి. వినూత్న సమ్మిళిత ఆవిష్కరణలతో సృజనాత్మక విజయాలను సాధించాయి. ఒక సమాజంపై మరొక సమాజం ఆధిపత్యం వహించలేదు. పరస్పర గౌరవం లేని సమాజాలలో అనేక అంశాల ఫలితాలు నకారాత్మకంగా ఉన్నాయి. ఆఫ్రికా దేశాల ప్రజల బానిసత్వం, మానవ హననాలు, నల్లమందు యుద్ధాలు వగైరా విషయాల్లో సాధారణ సారూప్యత కనిపిస్తుంది. ఒక సమాజ ప్రజలు మరొక సమూహ ప్రజల కంటే అధికులు, ఉన్నతులు అన్నఊహాజనిత భావజాలం ఆధారంగా ఉత్పన్నమయిన తీవ్ర అమర్యాద, అణచివేత సంప్రదాయ లక్షణాలే ఆ సారూప్యత.

ఎదుటివారి విలువల గుర్తింపు ఆధారంగా జరిగిన జ్ఞాన మార్పిడి, అనుభవాల, కొత్త విషయాల పంపకం శాశ్వత ప్రయోజనాలను చేకూర్చాయి. విభిన్న విధానాల ఆచరణలో ఘర్షణతో సమాజాలు మానవ హక్కులను సాధించలేవు. ఒకరి విధానం మరొకరి దాని కంటే ఉన్నతమైందని నిరూపించడానికి చర్చలను, వాదనలుగా మార్చిన సందర్భాలలో మానవ హక్కులకే విరుద్ధమైన ఫలితాలు లభించాయి. మానవ హక్కుల సాధనకు భిన్న సమాజాలు, విభిన్న విధానాలను ఎందుకు పాటించాయన్న విషయం పరస్పర గౌరవ మర్యాదలతో జరిగే చర్చలతోనే అర్థమవుతుంది. వివిధ దేశాలు విభిన్న మానవ వ్యవహార పద్ధతులను ఆచరిస్తాయి. ఒక సమాజ విధానాలు మరో సమాజానికి ఆచరణ సాధ్యం కాదు. సమాజాల మధ్యప్రాధాన్యతల, సంప్రదాయాల, చరిత్ర, సంస్కృతుల తేడాలతో ఏకరూప ఆచరణ అసాధ్యం. సమస్యల అవగాహన, అనుభవాలు పంచుకోడం, ఒకరినొకరు అర్థం చేసుకోడం చర్చల లక్ష్యం కావాలి. చర్చల ఫలితంగా ప్రజలు విడిపోరాదు, సమాజం చీలిపోకూడదు. పాలకులు మత ప్రాతిపదికన ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టరాదు. కార్పొరేట్ల కొమ్ముకాసి సామాన్యులను బాధలకు గురిచేయరాదు. దేశాల మధ్య సంపద సమీకరణ పోటీ ఉండరాదు.

శాంతి, అభివృద్ధి, సహ జీవనం, సహాయ సహకారాలు, ప్రపంచ భాగస్వామ్య లక్ష్యాలు. అంతర్జాతీయ సంబంధాల నిర్వహణలో మత, ధాతృత్వ సంస్థలకు చోటుండరాదు. ప్రపంచ కూటములు పొరుగు దేశాల, వెనుకబడ్డ దేశాల అభివృద్ధికి ఏర్పడాలి, కృషి చేయాలి. ఒక దేశాన్ని కిందకు లాగడానికి, అనారోగ్య పోటీతో దాని అభివృద్ధిని అడ్డుకోడానికి చిత్రమైన పేర్లతో గుమికూడరాదు. చతుష్టయం (క్వాడ్), త్రయోదశం (ఇండో పసిఫిక్ తడిక) ఈ దుష్టలక్ష్యంతోనే ఏర్పడ్డాయి. జి-7, జి- 20 కూటములను పక్షపాత పక్షాలుగా మార్చారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస), బ్రెటన్ వుడ్ సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి అగ్రరాజ్య కనుసన్నల్లో, దానికి అనుకూలంగా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ఈ సంస్థల ఎన్నికల విధానాన్ని మార్చాలి. వీటిని 78 ఏళ్ల అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యం నుండి రక్షించాలి. ఐరాస స్థిరాభివృద్ధి లక్ష్యాలు నెరవేరాలంటే ప్రపంచ ప్రజలందరికీ, ప్రత్యేకించి వెనుకబడ్డ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు, ప్రయోజనాలు చేకూరాలి. ఐరాసను అగ్రరాజ్య బంధం నుండి విముక్తి చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఐరాస సాధారణ సభ సంపన్న దేశాల కోసం కాక సామాన్య ప్రజల కోసం క్రియాశీలకంగా పని చేయాలి.

ప్రపంచీకరణ వ్యవస్థాగత సంస్కరణల అవసరాలకు, సమ్మిళిత విశ్వపాలనకు, ఆధిపత్య దేశాల రహస్య కుట్రల, రాజకీయ ముఠాల అంతానికి, 1945 వరకు ప్రపంచాన్ని ఏలిన వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయడానికి అన్నబూచితో ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల మధ్య ఆమోదం కుదిరింది. ప్రపంచ వాణిజ్య సంస్థను అమెరికా, పాశ్చాత్య దేశాలు స్వలాభానికి స్థాపించుకున్నాయి. చైనా పట్టుబట్టి దానిలో చేరింది. అమెరికాకు కళ్ళెం వేసి ప్రపంచ వాణిజ్య సంస్థను చక్కగా వాడుకుంది. తమ అవసరం తీరి, చైనాను వాణిజ్య పోటీలో ఎదుర్కోలేని అమెరికా ఇప్పుడు దాని అవసరం లేదంటోంది. అమెరికా సామ్రాజ్య వాదాన్ని నిలువరించడం అత్యవసరం. దానికి చైనా, -రష్యాల కూటమి బలపడాలి. ఇండియా అమెరికా పంచన చేరి చైనాకు మోకాలు అడ్డే చర్యలు మానాలి. ప్రపంచ ప్రజలందరికీ ప్రత్యక్షంగా, న్యాయబద్ధంగా ప్రపంచ వనరులు, ప్రయోజనాలు, అభివృద్ధి అందాలి. అసమతుల్య, అసమగ్ర బహుళజాతి సంస్థల వృద్ధి స్థానంలో సమగ్ర, సహకార, సమ్మిళిత ప్రజాప్రగతి జరగాలి. అంతర్జాతీయ పెత్తనం పోవాలి. ప్రభావశీల బహుళపక్ష యంత్రాంగం, ప్రాంతీయ క్రియాశీల సహకారం, ప్రజాబలం పెరగాలి. మానవ హక్కుల రక్షణ జరగాలి. మానవాళి బంగారు భవిష్యత్తుకు వివిధ సామాజిక వ్యవస్థల, చరిత్రల, సంస్కృతుల, ప్రగతిశీల భావజాలాల శక్తులు కలిసి పని చేయాలి. ఉమ్మడి అభివృద్ధిని, ఆసక్తులను, హక్కులను కాపాడుకోవాలి. బాధ్యతలను పంచుకొని సమన్వయశక్తితో నూతన ప్రగతిశీల ప్రపంచ సాధనకు కృషి చేయాలి.

బహుళరంగ, బహుముఖ అభివృద్ధి ప్రపంచ సామాజిక సంపద. ఏ దేశానికీ గుత్త సొత్తు కాదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ సాంకేతిక సంగణీకరణ (డిజిటల్) అభివృద్ధిని ఇతర ప్రపంచ దేశాలకు పంచాలి. అంతర్జాతీయ సంగణీకరణ సమాజాన్ని నిర్మించాలి. ఆధునిక, యాంత్రీకరణ ప్రపంచానికి సాంకేతిక సాధికారత అత్యవసరం. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. ప్రజారోగ్య వ్యవస్థను పెంపొందించాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి. కర్బన ఉద్గారాల తగ్గింపుతో భూతాపాన్ని తగ్గించాలి. కార్పొరేట్ సంస్థల కొమ్ముకాసే ప్రభుత్వాలు ఈ పనులు చేయవు. మానవ హక్కుల ఉల్లంఘనలలో పేదరికం ప్రధానమైంది. ఉపాధి రాహిత్యం, జీవన సమస్యల పరిష్కారంలో సంఘర్షణతో ప్రజలు తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. విద్య కార్పొరేటీకరణ సామాన్యులను చదువుకు దూరం చేసింది. విద్యారాహిత్యం ఆలోచనాశక్తిని, ప్రశ్నించే తత్వాన్ని, వివేక విచక్షణలను తగ్గించింది. కార్పొరేట్ వైద్యం ప్రజలను పేదరికానికి నెట్టింది.

ఆకలిదప్పులతో పోరాడుతున్న ప్రజలు పాలక పొరపాట్లను పట్టించుకోలేరు. సామాజిక మార్పు వారి బుర్రకు అందని అంశం. పాలకులు అధికార పునఃసంపాదన ప్రయత్నాల్లో మునిగారు. వారికి ప్రజా సమస్యలు, మానవ హక్కులు పట్టవు. మతవాద ప్రభుత్వాల పెరుగుదల నేటి ప్రపంచానికి పట్టిన కొత్త పీడ, చీడ. ఈ ప్రభుత్వాధినేతలు మానవత్వం మరిచిన మతోన్మాదులు. పౌరసంఘాలు, ప్రగతిశీల సామాజిక సంస్థలు, ప్రజాపక్ష రాజకీయ పార్టీలు స్వీయ సంస్కరణలతో నూతన పద్ధ్దతులలో ప్రజలను చైతన్యపరచాలి. సహజ సంపదల, ప్రకృతి వనరుల దోపిడీకి, ప్రపంచ వాణిజ్య ఆధిపత్యానికి, అధిక లాభాల కోసం సామ్రాజ్యవాద దేశాలు యుద్ధాలను ప్రోత్సహిస్తాయి. ఇరు పక్షాలకు ఆ దేశాల కార్పొరేట్ సంస్థలు తమ యుద్ధ సామగ్రిని, ఆయుధాలను అమ్ముతాయి. అభివృద్ధికి శాంతి ముందస్తు అవసరం. యుద్ధాలలో పేదలు, స్త్రీలు, పిల్లలు, వలస కార్మికులు, శరణార్థులు ప్రధాన బాధితులు. యుద్ధాలు మానవ హక్కులను హరిస్తాయి. మానవవాద పాలకులను, ప్రజాహిత పార్టీలను ఎన్నుకోడమే మానవ హక్కుల రక్షణ మార్గం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News