Monday, December 23, 2024

జవాబుదారీతనం లోపమే కారణం

- Advertisement -
- Advertisement -

దేశం ఆధునికంగా పరుగులు పెడుతుందని, అందమైన రహదారులు, పెద్ద భవంతులతో ఆకర్షణీయంగా కన్పిస్తున్నా పంటి కింద బాధను దిగమింగుతూ పస్తులు వుంటున్న కుటుంబాలు దేశంలో అనేకం వున్నాయి. పేదరికంలో మన దేశం మరింత దిగజారి సామాన్యుడు ఒక పూట భోజనం చేయలేని దుస్థితి దాపురించింది. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ పేదోడి ఆకలిని తీర్చడం లేదు.కోట్లలో బ్యాంకు రుణాలను మాఫీ చేసే ప్రభుత్వాలు పేదోడి ఆకలి కడుపును నింపలేకపోతుంది. ఫలితంగా ఎంతో భవిష్యత్తు వున్నా చేసేదేమీ లేక రోజు కూలీలుగా మారే పరిస్థితి కలుగుతున్నది. అత్యాశపరులకు అండగా నిలవడమే ప్రధానంగా అవినీతికి మూలం అవుతున్నది. ప్రభుత్వాల చేత పనులు చేయించుకోవడం ప్రజల హక్కు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేకుండా పోయింది. కనీసం పేదల ఆవేదనను అర్థం చేసుకోవడం కాదు కదా వినడానికీ పాలకులకు ఓపిక లేకుండా పోయింది.

ఆ నిర్లక్ష్యమే అవినీతి పెరిగిపోవడానికి కారణం అవుతున్నది. ఫలితంగా దేశంలో రోజు రోజుకు పేదరికం మరింత పెరిగిపోతున్నది. దీనంతటికీ కారణం రాజకీయ వ్యవస్థ అని చెప్పక తప్పదు. రాజకీయ వ్యవస్థలో మార్పు రాకుండా అవినీతి అంతం కావడం అనేది అంత సులువు కాదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజల్లో తీవ్రమైన ఆశలు కల్పిస్తూ రాజకీయ హోదాను అనుభవిస్తున్నారు.
అవినీతి అనేది ఒక అంటువ్యాధి వంటిది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి పాకినట్టు, అవినీతి అనేది కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. అంటువ్యాధి ఆరోగ్యానికి హాని చేసినట్టు, అవినీతి కూడా సామాజిక అభివృద్ధికి అడ్డుపడుతున్నది. అలా అనడానికి అసలు అవినీతి అంటే నీతి తప్పి ప్రవర్తించడం అంటారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో అవినీతిని మాత్రం రూపుమాపలేకపోతున్నాం. భారత దేశం వివిధ రంగాల్లో ప్రపంచ దేశాల సరసన ఆధునికంగా రాణించగలుగుతున్నప్పటికీ లంచం అనే మహమ్మారి క్యాన్సర్ కంటే ప్రమాదకరంగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తుంది.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజలకు నిస్వార్థ సేవ చేయాల్సిన వివిధ రంగాల ఉద్యోగ వర్గం బల్ల కింద నుంచి చేయి చాచడం మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయా లు, ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లాలంటేనే సామాన్య ప్రజలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటెండర్ స్థాయి నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు లంచానికి అలవాటు పడి సామాన్య ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. ఆ నయ వంచన వల్లే భారత దేశంలో నిజమైన ప్రతిభ బయటకు రాకపోవడం కారణంగా చెప్పవచ్చు.
దేశ వ్యాప్తంగా లంచం అనే మహమ్మారి భారీనపడిన వారెందరో గుణాత్మకతను చంపుకొని సమాజానికి తన వృత్తి ద్వారా సేవలందించాల్సిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడడం, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లంచం లేనేదే పని జరగదనే విధంగా ప్రజల్లో దొడ్డి దారిని వారి మెదళ్లో నిండా నింపారు. ప్రజలు సైతం సహనాన్ని కోల్పోయి తమ అత్యుత్సాహం వల్ల పని జరిగితే చాలు అన్నట్లుగా లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

అవినీతి అంతం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ అది వేళ్ళూనుకుపోయింది. చిన్న ఉద్యోగుల నుంచి కలెక్టర్ హోదా అనుభవించిన వారు సైతం లంచాలకు నీతిని అమ్మేసి అవినీతిని గెలిపిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్‌పై పెట్రోల్ పోసిన చంపిన ఉదంతం, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసిన ఓ వ్యక్తి కోటికి పైగా లంచంతో రెడ్‌హ్యాండెడ్‌గా గతంలో దొరికిపోయారు. ఇవేకాకుండా అనేక మంది వివిధ స్థాయిలోని ఉద్యోగులు లంచావతారాలెత్తి కోట్లకు పడగలేస్తున్నారు. అవినీతి కారణంగా పేదల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతున్నాయి. దారిద్య్రం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికీ దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, ఎన్‌జిఒలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకోవాల్సి ఉంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి.

కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్‌నెట్, టిబి, ప్రింట్ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పార్టీలకు నిధులు అందించడంలో, పాలనా వ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించుకోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంత మేరకు తగ్గించవచ్చు.

ఎన్నికల్లో రాజకీయ వ్యవస్థల అవినీతి తొలగించేందుకు సంస్కరణలు చేపట్టాలి. ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధివిధానాలు ఏ పని, ఎన్ని రోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్ చార్టర్‌లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలు జరిగేలా కార్యాచరణ ఉండాలి. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం ప్రజలకు తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అవినీతి దూరమవుతుంది. కేంద్రీకృత పాలన అవినీతికి మూలమైంది. దీనికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి వుంది. జవాబుదారీతనంతో స్థానిక ప్రభుత్వాలు సాధించాలి. మన దేశాన్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతినబూనాల్సిన అవసరం ఎంతైనా వుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నిరంతరం కొనసాగాలి. దీనికి నిజాయితీ కలిగిన పటిష్టవంతమైన రాజకీయ నాయకత్వం అవసరం. చురుకైన పౌర సమాజం అంతకంటే అవసరం.

ప్రభుత్వోద్యోగుల నియామకాలు, బదిలీ, పదోన్నతి, క్రమశిక్షణా చర్యలు వంటి అంశాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సివిల్ సర్వీస్ బోర్డ్ లాంటి వ్యవస్థకు అప్పగించాలి. రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించాలి. అవినీతి నిర్మూలనకు ప్రతి పౌరుడు కృషి చేస్తే గానీ సాధ్యం కాదు. ప్రభుత్వం ద్వారా పని చేయించుకోవడం పౌరులుగా మన బాధ్యత. దానిని డబ్బుతో కొనాలని చూడడమూ నేరమే. లంచం తీసుకునే వారి కంటే ఇచ్చే వారి వల్లే అవినీతి అంతం కాకపోవడానికి ప్రధాన కారణం. మన అవసరం కొంత ఆలస్యమైనా ఫర్వాలేదు గానీ అవినీతిని మాత్రం ప్రోత్సహించకుండా నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం అందరి పైనా వుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News