Tuesday, January 7, 2025

ఆహార భద్రతలో పాలకుల వైఫల్యం!

- Advertisement -
- Advertisement -

భారత సామాజిక వ్యవస్థ వర్గ వ్యత్యాసాలతో కూడుకొని వుంది. ప్రజలు పేద, ధనికవర్గాలగా విభజించబడ్డారు. దేశ సంపద అంతా ధనిక వర్గాల వద్దే పొగుబడి వుంటుంది. శ్రమపడి ఉత్పత్తులు సృష్టించే పేదలకు వాటిపై హక్కులేక, వేతన కూలీలుగా చాలీచాలని ఆదాయంతో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. సరైన ఆహారం పొందలేక అనేక రోగాల పాలవుతున్నారు. వారి పిల్లలు పోషకాహార లోపం వలన రక్తహీనతకు, బరువు తక్కువకుగురై ప్రాణాలు కోల్పోతున్నారు. పేదరికానికి, ఆహార భద్రతకు, పోషకాహార లోపానికి అవినాభావ సంబంధం వున్నది. పేదరికం నుంచి పేదలు బయట పడాలంటే వారి కుటుంబ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే వారు చేసే ఉత్పత్తులపై వారికి హక్కు వుండాలి. గ్రామీణ పేదలు రెక్కలుచేసుకుని చెమట బిందువులే సాగునీరుగా మార్చి పంటలు పండిస్తే వాటిపై వారికీ ఎటువంటి హక్కు లేకుండాపోయింది. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆ పంటలను తన్నుకుపోతున్నారు. పేదల రెక్కల కష్టాన్ని దోచుకుని విలాస జీవితాలు గడుపుతున్నారు. పట్టణ శ్రామికవర్గ తమ శ్రమశక్తితో, నైపుణ్యంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తుల చేస్తున్నారు.

వారు కష్టపడే ఫ్యాక్టరీల్లో వారికి ఎటువంటి భాగస్వామ్య లేదు. వారు చేసే అదనపు శ్రమశక్తితో పెట్టుబడిదారులు లాభాలు గడిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గ్రామీణ పేదల, పట్టణ శ్రామికుల శ్రమశక్తిని కొల్లగొట్టిన భూకామందులు, బడా పెట్టుబడిదారులు సంపదకు అధిపతులవుతున్నారు. ఫలితంగా పేద, ధనిక వర్గాల వ్యత్యాసం దేశంలో తీవ్రమైంది. దేశం ఏంతో అభివృద్ది చెందిందని, అంతరిక్ష పరిశోధనల కోసం రాకెట్లను చంద్రమండలానికి పంపే స్థాయికి ఎదిగామని, ప్రపంచ మూడవ ఆర్థిక వ్యవస్థగా సంపన్న దేశాల సరసన నిలుస్తున్నదని మోడీ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటున్నది. అభివృద్ది అంటే అద్దాల్లా మెరిసే రోడ్లు, బహుళ అంతస్థుల మేడలు, చంద్రమండలాని రాకెట్లు పంపటం కాదు. ఆకలి ఎరగని సమాజం, పస్తులు ఉండని ప్రజలు దేశాభివృద్ధికి నిదర్శనం.భారత అభివృద్ధి ఇందుకు భిన్నంగా ఉంది. పేదరికం, ఆకలి విషయంలో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. 2021లో విడుదలైన గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం పేదరికంలో వున్న 116 దేశాల్లో భారత దేశం 101 స్థానంలో ఉంది. ఇది దేశంలో పేదరిక భయంకర స్థితిని తెలియ జేస్తున్నది. ప్రపంచంలో తీవ్ర దుర్భిక్ష, క్షామంతో అల్లాడే దేశం నైజీరియా. ఆ దేశంలో నూటికి 39% మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

నైజీరియాను వెనక్కి నెట్టేలా భారత పరిస్థితి వుంది. ప్రపంచ పేదరిక రాజధానిగా భారత్ నైజీరియాను వెనక్కి నెడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో జనాభా పెరుగుదలను సూచిస్తూ ప్రపంచ పాపులేషన్ క్లాక్ అనేది వుంటుంది. ఎప్పుడు ఎంత మంది పుట్టారనే దానిపై ఆధారపడి ప్రపంచ జనాభాను అప్ టు డేట్‌గా చూపిస్తుంది. అలాగే వరల్డ్ పావర్టీ క్లాక్ కూడా వుంది. దాని ఆధారంగా ఏయే దేశాల్లో పేదరికం ఎంత ఉంది అనేది అంచనా వేయవచ్చు. ఈ వెబ్‌సైట్ సేకరించిన సమాచారం ప్రకారం నైజీరియా కంటే భారత్‌లో పేదల సంఖ్య ఎక్కువగా వుంది. భారత్‌లో 8,30,68,693 మంది పేదలు కటికి దారిద్య్రం అనుభవిస్తున్నారు. కనీసం తిండి కూడా దొరకని పేదరికం వారిది. భారత్‌లో ప్రతి ఏడాది పేదరికం పెరుగుతూ ఉంటే, నైజీరియా తగ్గుతూ వస్తున్నది. 2019- 20లో 18.5 శాతం ఉన్న పేదరికం 2020- 21 నాటికి 26.5 శాతానికి పెరిగింది. సంపద కొద్ది మంది ధనికవర్గం వద్ద పోగుపడటంతో దేశంలో నానాటికీ పేదరికం తీవ్రరూపం దాలుస్తున్నది. పూట గడవడమే కష్టంగా పేదల జీవితాలు మారాయి. పేదల ఆకలి కేకల ఆర్తనాధాలు హృదయమున్న మనుషులను కల్లోల పరుస్తున్నది.

ఒక వ్యక్తి తీసుకునే పౌష్టికాహార (కేలరీలు) ఆధారంగా గతంలో దారిద్య్రానికి నిర్వచనంగా చెప్పారు. 2011 -12 లెక్కల ప్రకారం రోజు వారి తలసరి వ్యయాన్ని గ్రామీణ ప్రాంతంలో 26, పట్టణ ప్రాంతంలో 32 రూపాయలగా నిర్ణయించిన తర్వాత దాన్ని 32, 47 రూపాయలుగా దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిని గుర్తించే కమిటీ నిర్ణయిచింది. ఇది చాలా హాస్యాస్పదంగా వుంది. ఈ మొత్తంతో తమ అవసరాలను పేదలు ఎలా తీర్చుకోగలుగుతారు. సంపన్న వర్గాలు ఒక కప్పు కాఫీకి ఖర్చుపెట్టే అంత కూడాలేదు. ఈ ఖర్చు చేయగల వారంతా పేదరికానికి ఎగువున వున్న వారుగా చెప్పటమంటే పేదరికాన్ని అపహాస్యం చేయడమే. పౌష్టికాహార లోపం చిక్కిపోయిన, ఎదుగుదల లేని పిల్లలు, పిల్లల మరణాలు, రోజువారీ కుటుంబ వ్యయం పేదరికానికి నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహారాన్ని ఎదుర్కొంటున్న ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న 116 దేశాల్లో భారత్ టాప్ ర్యాంకులో వుంది. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందటంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో దానిని పక్క దారి పట్టించటానికి ప్రజా పంపిణీ (పిడిఎస్) వ్యవస్థ ద్వారా సబ్సిడీ ఇచ్చి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని పాలక ప్రభుత్వం ప్రకటించింది.

భారత దేశం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1945-జనవరి -14న ఆహార ధాన్యాల సబ్సిడీ పథకం ప్రారంభమైంది. 1947లో భారతదేశంలో రేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. అ కాలంలో బెంగాల్లో తీవ్ర కరవు ఏర్పడింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత 1960ల ప్రారంభంలో దేశం తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో రేషన్ వ్యవస్థ పునరుద్ధరణ జరిగింది. ఇవి ఆచరణలో విఫలం కావటంతో 2013 యుపిఎ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చింది. దేశంలోని మూడు వంతుల మందికి సబ్సిడీ రేట్లపై ఆహారం, పోషకాహార భద్రతను అందించడం ఈ పథకం లక్ష్యంగా చెప్పింది. ఈ చట్టం ప్రకారం దేశ ప్రజల్లో 67% ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చబడడం ద్వారా 90 కోట్లకు మందికి వర్తింపచేయవలసి ఉండగా, 80 కోట్ల మందికే వర్తించింది. దీన్ని గమనిస్తే ప్రారంభంలోనే పథకానికి తూట్లు పడ్డాయి. భారత పాలక వర్గాలు, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్‌ఫర్డ్ లాంటి సంస్థలు 2005 -06, 2019- 21 భారత దేశంలో 415 మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రకటిస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో అర్హుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నది.

అత్యోదయ లాంటి పథకాలు ఎందుకు అమలు జరుగుతున్నాయి. అందువలన భారత్‌లో పేదరికం తగ్గిందనే ప్రచారం ఎంత బూటకమో వెల్లడవుతున్నది. పేదరికానికి కారణాలైన మౌలిక సమస్యల జోలికి వెల్లకుండా నిత్యం పేదరికంలో ఉండేలా జాతీయ ఆహార భద్రత చట్టం లాంటి వాటితో పేదలను మభ్యపెట్టే విధానాలు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదరికం పోవాలంటే గ్రామీణ పేదలకు భూమి పంపిణీ జరగాలి. అందుకు భూకేంద్రీకరణను బద్దలుకొట్టాలి. పట్టణ శ్రామికులకు శ్రమకుతగ్గ వేతనంతో పాటు పరిశ్రమల్లో భాగస్వామ్యం ఉండాలి. ఇవి మోడీ ప్రభుత్వం లాంటి భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల అనుకూల ప్రభుత్వాలు చేయవు. గ్రామీణ, పట్టణ శ్రామికులు సమైక్యంగా ఉద్యమించి సాధించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News