న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తనుందన్న భయాందోళనలు నెలకొని ఉన్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కరెంటు కోతలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కొరత సమస్యను లేవనెత్తాయి. దాంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్రాలకు అనేక కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాలకు కేంద్రం (గ్రిడ్) వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్’ను వాడుకోవాలంది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంటు సాయం చేయాలంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన జారీచేసింది.
“వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా లోడ్ సర్దుబాటు కోసం కొన్ని రాష్ట్రాలు కోతలు విధిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇంతేకాకుండా అధిక ధరలకు విద్యుత్ విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. వినియోగదారులకు విద్యుత్ సరఫరాచేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే. వారు ముందు వినియోగదారులకే సేవలందించాలి. అంతేకాని వారికి ఎగ్గొట్టి విక్రయించుకోకూడదు” అని విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
విద్యుత్ కేటాయింపుల మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ఉత్పత్తి స్టేషన్ల వద్ద 15 శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రాలకు కేటాయించకుండా ఉంచుతారు. అత్యవసర పరిస్థితిలో విద్యుత్ బాగా అవసరమున్న రాష్ట్రాలకు దీన్ని కేంద్రం కేటాయిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్టా అలా కేటాయించని విద్యుత్‌ను వినియోగించుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇక మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఆ విషయాన్ని కేంద్రానికి తెలుపాలని సూచించింది.