మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఎఇ బూక్య మధుకర్ రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం నాడు ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నగరంలోని ఎల్‌బి నగర్ పరిధిలోని నాగోల్‌లోని బండ్లగూడలో బూక్య మధుకర్ ఎలక్ట్రికల్ ఎఇగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఎల్‌బినగర్‌కు చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ప్రదీప్‌కుమార్ రెడ్డి తన కాంట్రాక్టు పనులకు సంబంధించి పూర్తి నివేదికను సరూర్‌నగర్ ఎడిఇకి సమర్పించేందుకు రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి పూర్తి నివేదిక సరూర్‌నగర్ ఎడిఇకి ఇవ్వాలంటే అడిగినంత లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో బాధితుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి రూ. 15వేలకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
అనంతరం ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఎఇ బూక్య మధుకర్ తనను లంచం డిమాండ్ చేసిన విషయాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు ఎఇ బూక్య మధుకర్ తన కార్యాలయంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి నుంచి రూ. 15వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే బూక్య మధుకర్ లంచం మొత్తాలు తీసుకుని తన ప్యాంట్‌లోని పర్సులో దాచి ఉంచిన నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఇ మధుకర్ రెండు చేతుల వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించి అరెస్ట చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. లంచం కేసులో పట్టుబడిన ఎఇకి ఎసిబి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.