Monday, December 23, 2024

ఎన్టిపిసి తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రాజెక్ట్ మొదటి దశ 1వ 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 0.53 గంటలకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయ్యిందని ఎన్టీపీసీ అధికార వర్గాలు తెలిపాయి. 800 మెగావాట్ల యూనిట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తెల్లవారుజామున 3.26 గంటల నుంచి గ్రిడ్‌కు అనుసంధానం చేసి తెలంగాణ ప్రాజెక్ట్ తొలి వెలుగులను రాష్ట్రానికి అందజేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఎన్టీపీసీ నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్ అందించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే రామగుండం ఎన్టీపీసీ వద్ద తెలంగాణ ప్రాజెక్ట్ ఒకటవ దశకు చెందిన రెండు విద్యుత్ యూనిట్లకు 2016 జనవరి 29న జీరో తేదీతో నిర్మాణం పనులు ప్రారంభించారు.

సుమారు 10,580 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి పర్యావరణానికి హాని లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరిపేందుకు 275 మీటర్ల ఎత్తుతో చిమ్నీని నిర్మించి అందులో నుంచి బొగ్గు, విష వాయువును గాలిలో కలవకుండా ఎఫ్‌జిడి సిస్టం ఏర్పాటు చేశారు. అంతేగాకుండా దక్షణాది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లను నిర్మాణం చేశారు. రోజూ వారి విద్యుత్ ఉత్పత్తికి సరిపడే బొగ్గును సమీప సింగరేణి గనుల నుంచి ఒప్పందం కుదుర్చుకొని దిగుమతి చేసుకుంటున్నారు. అదేవిధంగా సమీప ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగుమతి చేసుకుంటున్నారు.

తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి వెలువడే బూడిదను ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా ఎలుకలపల్లి సమీపంలో నిర్మించిన యాష్ పాండ్‌కు తరలిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో రామగుండం ఎన్టీపీసీ ఈడి సునీల్ కుమార్ ప్రాజెక్ట్‌కు చెందిన ఉద్యోగులు, అధికారులతోపాటు పలు ఏజెన్సీలను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News