ఉద్యోగులు సంఘటితంగా పోరాడాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 నాయకుల పిలుపు
హైదరాబాద్: విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ఎలక్ట్రిసిటీ అమైండ్‌మెంట్ బిల్లును 2020ను వ్యతిరేకించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. 1104 యూనియన్ కార్యాలయం మింట్‌కాంపౌండ్‌లో రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు వేమూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆలిండియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్‌శర్మ, కృష్ణబోయర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ బిల్లును పార్లమెంట్‌లో అమలుకాకుండా అడ్డుకోవాలన్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే రైతులకు, ఉద్యోగులకు, కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగులు సంఘటితంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సలహాదారు జనార్ధన్ రెడ్డి, పద్మారెడ్డి, సుధీర్, శంకర్, వరప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.