Saturday, November 16, 2024

పంజాబ్‌లో విద్యుత్తు యూనిట్‌కు రూ.3 తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Channi
ఛండీగఢ్: మరికొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఆయన సోమవారం చేశారు. కాగా కొత్త రేట్లు కూడా నవంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగితే ఉచిత విద్యుత్‌ను ఇస్తానని ఇదివరకే వాగ్దానం చేశారు. ఈ దృష్టా అక్కడి ముఖ్యమంత్రి యూనిట్ ఛార్జీని తగ్గించారు. అయితే తాము నిర్వహించిన సర్వే ప్రకారం పంజాబ్ ప్రజలు ఉచిత విద్యుత్‌ను కోరుకోకుండా కేవలం చౌక రేట్‌లో విద్యుత్తును కోరుకుంటారని ముఖ్యమంత్రి చన్నీ చెప్పారు. ఇంకా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డిఏ) 11 శాతం పెంచుతానని ప్రకటించారు. ఇందుకు రూ. 440 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
‘అత్యధిక కరెంటు బిల్లులు పంజాబీలను ఠారెత్తిస్తున్నాయి. అది పేదరికానికి, ఆందోళనకు దారి తీస్తోంది. అంతేకాక ఆత్మహత్యలకు కూడా దారి తీస్తోంది. దీనిని మేము పరిష్కరించబోతున్నాం. ఈ విషయంలో నేడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది’ అని చన్నీ తెలిపారు.

పంజాబ్ ఈ ఏడాది సబ్సిడీలపై రూ. 3316 కోట్లు ఖర్చు చేసింది. “పంజాబ్ ఇప్పటికే విద్యుత్ మీద రూ. 10628 కోట్లు భరిస్తోంది. ఇప్పుడది రూ.14000 కోట్లు కానుంది. ఇది ఢిల్లీ ఖర్చు చేసేదానికంటే 7రెట్లు ఎక్కువ. ఢిల్లీ కేవలం రూ. 2200 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది” అన్నారు.

పంజాబ్‌లో ఇక కొత్త రేట్లు వినియోగదారుల భారాన్ని తగ్గించబోతోంది. పంజాబ్‌లో ఆదివారం వరకు 100 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ. 4.19 ఉండింది. అది సోమవారం నుంచి యూనిట్‌కు రూ. 1.19 కానున్నది. కాగా 100 నుండి 300 వరకు ఉండే యూనిట్లకు ఇప్పటి వరకు రూ. 7 చొప్పున ఛార్జీ చేయబడుతుంది. అయితే అది ఇకపై యూనిట్‌కు రూ. 4.00 చొప్పున ఛార్జీ చేయబడుతుంది. ఇక 300 యూనిట్లకు పైగా వాడేవారికి ఇప్పటి వరకు యూనిట్‌కు రూ. 8.76 వసూలు చేసేవారు. ఇకపై యూనిట్‌కు రూ. 5.76 వసూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీల వల్ల 95 శాతం గృహ వాసులకు ప్రయోజనం కలుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News