Thursday, January 23, 2025

మద్యం మత్తులో యువతిని వివస్త్రను ప్రబుద్ధుడు 

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్: మద్యం మత్తులో నడి రోడ్డులో యువతిపై దాడి చేసి ఆపై వివస్త్రను చేశాడో ఓ దుర్మార్గుడు. కాపాడటానికి అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగటంతో ఎవరూ ముందుకు రావడానికి సాహసం చేయలేదు. దీంతో ఒంటిపై నూలుపోగు లేకుండా భయంతో అల్లాడిపోయింది. ఈ అమానీయమైన ఘటన ఆదివారం రాత్రి జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఎసిపి వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్ డిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన వడ్డెర పెద్ద మారయ్య (28) కూలిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రతి రోజు మద్యం తాగి రోడ్డుపై వచ్చే వారితో గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి ఇంట్లో గొడవ పడి తల్లితో పాటు బయటకు వచ్చిన అతడు బాలాజీనగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ యువతి (26) రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చి ఆమెపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి ఎదురు తిరిగి అతనిపై చేయి చేసుకుంది. ఈ సంఘటనతో ఆ యువతితో మారయ్య, అతని తల్లి గొడవపడ్డారు. దీంతో రెచ్చిపోయిన మారయ్య ఆ యువతిపై విచక్షణరహితంగా దాడి చేసి ఒంటిపై ఉన్న బట్టలను చింపి వివస్త్రను చేశాడు.

అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగటంతో వారు భయపడ్డారు. అటుగా వచ్చిన ఓ మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆమెపై కూడా దాడికి పాల్పడటంతో భయంతో పారిపోయింది. దాదాపు 15 నిమిషాల వరకు ఎవరూ ఆ యువతిని కాపాడటానికి ముందుకు రాలేదు. కొద్ది సేపటికి ముగ్గురు మహిళలు ముందుకు వచ్చి ఒంటిపై కవర్ కప్పి రక్షించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

న్యాయం చేయాలంటూ మహిళ సంఘాల ఆందోళన కాగా ఆదివారం జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ ప్రజలు సోమవారం పలు మహిళ, ప్రజా సంఘాల నాయకులతో కలిసి బాధిత మహిళతో కలిసి పోలీస్‌స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నగర పాలక సంస్థ మేయర్ కావ్య, కార్పొరేటర్లు ఆలూరి సంగీతారాజశేఖర్, లలితాయాదవ్, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డితో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పోలీస్‌స్టేషన్ వద్ద బాధిత మహిళకు న్యాయం చేసి నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుషాయిగూడ ఎసిపి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేశామని, బాధిత యువతికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News