ఆ పిలుపు
కాకి రెక్కలను విరిచింది
రింగన్న పురుగును
ఖాళీ అగ్గిపెట్టెకు కుదించింది
కబడ్డీల కాలును మడతేసింది
నాలుకకు దుశేర్ తీగల బుట్టి
మద్యంలో తప్ప నాలుక పలుకదు.
పద్యం పలుకదు మైకు పలుకదు
మద్యం లాంటి మత్తు ఏదో
ఆవహిస్తే తప్ప. పలుకు లేక
పదిమందిల మాట కాలేను
నలుగురితో నడక కాలేను
‘నలుగురు కూర్చుని నవ్వే వేళల’
నవ్వు కాలేను నరనరాల్లో
శ్వాసిస్తుంటది ఆ పిలుపు
నేనెప్పుడూ రోడ్డు అంచులెమ్మడే
వంగి వంగి నడుస్తుంట
వాక్యనదికి జహ్నువు అడ్డుపడ్డట్టు
పదాలు గడ్డకట్టినట్టు…
కట్టడి చేస్తుంటది ఆపిలుపు
అందరికీ పిలిచి పీటేస్తరు
నా రంగు తీరేందో
నా ముఖం తీరేందో
నన్ను జూడంగనే
ముఖం దిప్పుకుంటరు
అమ్మగాళ్లాడినపుడు
గొంగళి పురుగు పారాడినట్టు
నడిచినప్పుడు జెర్రి లేచి నడిచినట్టు
పొరకతో అవతలికి ఊకేసినట్టు
సంకలకెత్తుకునే ప్రేమలుండవు
ఎగరేసి హత్తుకునే గుండెలుండవు
బుగ్గలను ముద్దాడే పెదిమలుండవు
చుబుకాన్ని నొక్కే మునివేళ్లుండవు
నాయిన నాగలై ఎల్తె
అమ్మ యిత్తనాల కుండై
యెంట యెల్తే పీతి ఈగనై
చీమల్ల చీమనై…
అ అంటే అ రాక
ఒకటంటే ఒకటి రాక
గులామలీ సార్ బెత్తం దెబ్బలకు
కొంకిల్ల ఏరుగుడు బడి
తెల్దక్కోన్నని పేరుబడి
నన్ను పురుగులా చూసిన చూపు
పసి మనసున వైరస్
రోజులు నెలలు ఏండ్లు దశాబ్దాలు
నోరు పెగలదు
మాటలు చీదరించి
చూపులు పక్కకు పారేసి
క్షణ క్షణం అస్తిత్వ హననం
ఏ గుంపుల కలిసినా నన్ను కుదిస్తున్నట్టే
ఎవరితో మాట కలిపినా
మాట నన్ను ముట్టడిస్తున్నట్టే
ఎవరి పక్కకు చేరినా నన్ను దహిస్తున్నట్టే
పక్కన నడుస్తున్నవాడు
మింగుతాడేమోనన్న భయం
నడువలేను ఎదురుగ
మనిషుంటే భయం పలుకలేను
నాలుక పిడుచగడుతది
తెలుపు నలుపు
ఏది నగం ఏది లోయ
ఏది శిఖరం ఏది అగాథం
ఏది గెలుపు ఏది ఓటమి
ఏది అల్పం ఏది అనల్పం
కనురెప్పల్ని నేనుకాని
ఎవరో కదిలిస్తున్నట్టుంటది
నడిచే కాళ్ళు నావి కావనిపిస్తుంటది
అనుభూతిలో ఎవరో చొరబడినట్టుంటది
కౌగిలి మధ్య చుంబనం మధ్య
ఏదో ఏలియెన్ జిగట పాదాల
బల్లి ఆవరించినట్టు
నలుపు ప్రకృతి శాపమా
దేవుడి శాపమా
మనిషి శాపమా
‘రాముడు నలుపు కృష్ణుడు
నలుపు అర్జునుడు నలుపు’
‘ద్రౌపది నలుపు’
‘అబ్దుల్ కలాం నలుపు’
ఏవీ శాంతినివ్వవు
హనన కాండల మిగిలిందొకటే
నేను పట్టుకున్న పుస్తకం.
పుస్తకం ఓదార్చింది
సీతాకోకచిలుకయి రెక్కలనిచ్చింది.
తాత్వికుడెవడో కవచకుండలాలనిచ్చిండు.
దు:ఖ మంచుఖండాల్ని
రక్త కణాల కణితుల్ని
శ్వాసల చొరబడిన ఇనుపతెరల్ని
కరిగించి కాగితాలకెక్కించింది
కవిత్వం. కవిత నౌక అయి
సప్తసముద్రాల్ని చూపించింది
కవిత్వ గండభేరుండం మీద
ఎగిరిన సమస్త భూమండలం
రేగుముండ్ల శ్వాసల్ని దాటి
నిర్గమ అరణ్యాలు దాటి
నల్లసముద్రాల్ని దాటి
నువ్వుగా నిలబడమన్నయి
పసితనంల ఆవహించిన భీతి వైదొలగి
మద్య మాధ్యమంగానయినా
మద్యం లాంటి ట్రాన్స్‌లోనయినా
కలం కవాతు చేసింది
నలుపే సిరా అయింది
ఉత్తర దక్షిణల సరిహద్దు
తూర్పు పడమరల సరిహద్దు
అధీన ఆధిపత్యాల హద్దు
హద్దులు తరిమిన కొద్దీ
హననాలు మింగిన కొద్దీ
వలయాలు కుదించిన కొద్దీ
ఒంటరి వలయం
వెన్నెల కురియని వలయం
నా రూపులాంటి నల్లని చీకటి వలయం
అసంబద్ధతే కవిత్వం
నిజం చెప్పడానికి ఎన్నో చానళ్లు
మఠాలు, మతాలు అవన్నీ
అబద్ధం అనడమే కవిత్వం
చూపు నలుపో, చూసే కనుపాప నలుపో
నలుపు తెలుపుల మధ్య
మెక్‌మోహన్‌రేఖ ఎప్పుడు మొలిచిందో
నది ఎప్పుడు రెండుగ చీలిందో
తెల్లని రుక్మిణి కృష్ణుడిని వలచింది
సుభద్ర అర్జునుడిని వలచింది
శూర్పణఖ రాముడిని వలచడం
నేరమెందుకయ్యిందో?
తెల్ల అమెరికాకు నల్ల అధ్యక్షుడొచ్చిండు
తెల్ల నాగలి నల్ల రేగడి ముచ్చట్లు విన్న నేను.
లోకంతో నాకు ముచ్చటెందుకు లేదో?
ఆ పిలుపు ఆఫ్రికాకు అనుసంధానం చేసింది
ద్రవిడ లిపి నన్ను పలుకరించింది
‘కర్రోడా’ ఆ పిలుపు ముళ్లపంది
చీమిడిలాంటి తెలుపు పిలుపు
మలంలో చీములాంటి తెలుపు పిలుపు
సుంకిరెడ్డి నారాయణరెడ్డి