Monday, December 23, 2024

నేటి పొదుపు రేపటి మదుపు

- Advertisement -
- Advertisement -

విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు కోరికల గుర్రాల స్త్వ్రర విహారాల నడుమ కుటుంబ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అనంత అగాధాలు ఏర్పడి, అప్పుల కుప్పలతో ఆర్థికంగా చితికిపోతున్న సంసారాలను మనం నిత్యం చూడవలసి రావడం బాధ కలిగిస్తున్నది. నవీన నరుడు తక్షణ ఆనందం వేటలో భవిష్యత్తు అవసరాలను మరిచి పోతున్నాడు. పొదుపు చేస్తూ భవిష్యత్తును అదుపు చేసుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నాడు. నేటి పొదుపే రేపటి ఆకస్మిక ఆపదలకు ఔషధమని కళ్ళు తెరవాల్సిన సమయమిది.  డబ్బు ఎంత సంపాదించాం అనేది ముఖ్యం కాదని, సంపాదనలో ఎంత పొదుపు చేయగలిగామనేదే ప్రధానమని అందరం గుర్తించాలి. కరోనా విజృంభన, లాక్‌డౌన్‌లు, ఉద్యోగ ఉపాధి కుదింపులు, ఉక్రెయిన్‌పై రష్యా నరంకుశ దాడులతో పాటు రూపాయి విలువ పతనం కావడంతో కుటుంబ ఖర్చులు పెరిగిన చేదు అనుభవాలను చవిచూస్తున్న అకాలమిది.

పొదుపు చేయని సంసారాలు ఆకలి చావుల ముంగిట నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. డబ్బు ఉన్న మనిషి చుట్టు పిలవకపోయినా పలువురు నడవంత్రపు నరులు మూగుతారు, చేతులు ఖాళీ కాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్ అవడం చూస్తేనే ఉన్నాం.పొదుపు ఆవశ్యకత ప్రచారం ప్రపంచ మానవాళికి పొదుపు పట్ల అవగాహనతో పాటు దాని ప్రాధాన్యతను వివరించే కృషిలో భాగంగా 31 అక్టోబర్ 1924న ఇటలీలో ‘వరల్ సొసైటీ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్స్’ స్థాపించబడింది. దీనికి గుర్తుగా ప్రతియేటా 31 అక్టోబర్ రోజున ‘ప్రపంచ పొదుపు దినం (వరల్ సేవింగ్స్ డే)’ పాటించబడుతూ విద్యాలయాలు, సామాజిక సమ్మేళనాల్లో పొదుపు అవశ్యకతను వివరించే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. స్పెయిన్, యూయస్‌ల్లో 1921 నుండే పొదుపు దినం పాటించుట జరగడం విశేషంగా పేర్కొనవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1955 -1970ల మధ్య ప్రపంచవ్యాప్తంగా పొదుపు పట్ల మానవాళికి అవగాహన పెరగడం జరిగింది. పొదుపు పట్ల అవగాహన, పొదుపు చేయడమనే అలవాటును చిన్నతనం నుండే ప్రారంభించాలనే సదుద్దేశంతో కిడ్డీ బ్యాంక్‌లు, సేవింగ్స్ ఖాతాలు, పిల్లలు గల్ల గురిగి వాడకాలకు నాంది పడింది. పొదుపు చేసిన డబ్బును ఇంట్లో దాయకుండా, జాతీయ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో జమచేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి నెల ఆదాయంలో కొంత భాగాన్ని బ్యాంకు పొదుపు ఖాతాలో జమ చేసుకోవాలనే ఆచారం మంచి ఫలితాలను ఇవ్వడం చూస్తున్నాం. పొదుపు చేయడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు జాతీయ ఆర్థికాభివృద్ధి జరుగుతుందని గమనించాలి. ప్రభుత్వ పథకాలలో స్థానిక బ్యాంకుల స్థాపన, జీవిత భీమా సంస్థలు, ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, పొదుపు సంఘాల ఏర్పాటు, కుటీర పరిశ్రమల ప్రోత్సాహం, పొదుపు చేసిన వారిని గుర్తించడం లాంటి అంశాలు జోడించాలి.

పొదుపు ప్రయోజనాలు
పొదుపు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనం తెలుసుకదా పిల్లలకు కూడా నేర్పించాలి. ఊహించని ఆపదలు, అత్యవసరాలు, అనారోగ్య సమయాల్లో పొదుపు చేసిన ధనం మనల్ని గట్టెక్కిస్తుంది. ఆపదల వేళలో ఆదా చేసిన డబ్బు ఆదుకుంటుంది. అనుకోకుండా ఆదాయం తగ్గినపుడు పొదుపు చేసిన డబ్బు అక్కరకు వస్తుంది. పొదుపు చేసిన డబ్బుతో పిల్లలకు మంచి విద్యను అందించవచ్చు. విశ్రాంత జీవితంలో పొదుపు చేసిన రొక్కమే మనకు దిక్కవుతుంది. పొదుపు చేసిన వ్యక్తులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అతిగా పొదుపు చేసి అనారోగ్యాల పాలు అయిన వారు కూడా మనకు తెలుసు. ఆధునిక జీవనశైలిని అలవర్చుకున్న వారు పొదుపు చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. డబ్బు అన్నింటికి పరిష్కారం కాకపోవచ్చు, కాని మన ఆర్థిక ఆరోగ్యం మనకు ఎదురయ్యే పలు సమస్యలకు చక్కటి సమాధానాలను ఇస్తుందన్నది. మన కుటుంబాల ఆరోగ్యానికి, ఆర్థిక పటిష్టతకు విడదీయరాని బంధం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారిలో 90 శాతం మందికి వ్యక్తిగత ఆరోగ్యం సిద్ధిస్తుందని తేలింది. భారతీయుల్లో పొదుపు చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది.

భారతంలో పొదుపు ఉద్యమం
భారతీయులు తమ సంపాదనలో 0% నుంచి 20% కన్న తక్కువ పొదుపు చేసే వారు 50% ఉన్నారు. తమ ఆదాయంలో 20 నుండి 30 శాతం పొదుపు చేసే ప్రజలు 20 శాతం మాత్రమే ఉండడం విచారకరం. పురుషులు ఆదా చేసిన డబ్బును మరల పెట్టుబడి పెడుతూ సంపద పెంచుకునే ప్రయత్నం చేస్తే, మహిళలు పిల్లల చదువులకు ఖర్చు చేయడానికి ఇష్టపడతారని తేలింది. అధిక వడ్డీకి ఆశపడి కష్టార్జితాన్ని కోల్పోయిన కుటుంబాలు మనకు మంచి గుణపాఠాన్ని నేర్పుతున్నాయి. డబ్బును ఆదా చేయడం, పొదుపు చేసిన డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని గమనించాలి. పొదుపు చేసిన రొక్కం తిరిగి ఆదాయానికి మరో మార్గం కావాలి. డబ్బులను పొదుపు చేయడమే కాకుండా విద్యుత్, నీరు, ఇంధనం లాంటివి ఆదా చేయడం కూడా మనకు, మన దేశానికి ఎంతో మేలును చేస్తాయి. వ్యక్తిగత జీవితంలో గెలుపుకు పునాది పొదుపే అని అర్థం చేసుకుందాం. పొదుపుకు, పిసినారితనానికి తేడాను అందరికీ, ముఖ్యంగా పిల్లలకు, యువతకు వివరించాలి. ఆదా చేయడం అలవాటు చేసుకుందాం. చిన్నతనం నుండే పిల్లలకు పొదుపు పాఠాలు నేర్పుదాం. పొదుపు ప్రతి ఒక్కరికి అత్యవసరమైన ఉత్తమ అలవాటని గుర్తిద్దాం, మన జీవితాలను సుసంపన్నం చేసుకుందాం.

జలజ మధు
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News