మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: క్రీడాకారులు ఒలంపిక్స్ క్రీడల్లో రాణించేలా క్రీడాల్లో సాధన చేయాలని.. తద్వారా దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రతిష్టతలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి నిర్వహించిన ఒలంపిక్ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, వాకర్స్, వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని నిత్యం సమపాళ్లలో తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ప్రత్యేకించి విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండేలా వారి వారి జీవనశైలి మెరుగుపర్చుకోవాలని సూచించారు.
ప్రభుత్వం క్రీడాభివృద్ధ్దికి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ క్రీడాకారులుగా రాణించి జాతీయ, అంతర్జాతీయ, ఒలంపిక్స్ క్రీడల్లో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా ప్రతీ క్రీడాకారుడు వారి వారి క్రీడల్లో సాధన చేయాలని అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వారు అన్నారు. నిత్య జీవితంలో వ్యాయామం అనేది ప్రధాన భూమిక పోషిస్తోందని, ప్రతి వ్యక్తి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ఆరోగ్యవంతంమైన సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. వాతావరణ మార్పుల వల్ల రోజురోజుకి ప్రతి వ్యక్తిలో శక్తి క్షీణిస్తున్నట్లు గమనిస్తున్నామని, తిరిగి ఆ శక్తిని సాధించేందుకు పోషకాహారాన్ని తీసుకోవడమే మార్గమన్నారు.
అందు కోసమే అంతర్జాతీయ స్థాయిలో ఒలంపిక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత వ్యాయామం అలవర్చుకుని నిత్య సాధన చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించిన నాడే ఒలంపిక్ డే రన్‌కి సార్ధకత ఉంటుందని వారు అన్నారు. జిల్లా కలెక్టర్ ఒలంపిక్ రన్ కోసం జెండా ఊపి ప్రారంభించగా ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఒలంపిక్ జ్యోతితో కలెక్టర్‌తో పాటు వారంతా ఎన్టీఆర్ స్టేడియం నుంచి రన్‌ను మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి. రామారావు, డివైఎస్‌ఓ బి.అనిల్ కుమార్, ఒలంపిక్ డే రన్ కార్యక్రమ కన్వీనర్ చాంప్లానాయక్, కో_కన్వీనర్ కల్లూరి ప్రభాకర్, క్రీడా సంఘాల బాధ్యులు వెలిశాల కుమారస్వామి, మద్ది వెంకట్‌రెడ్డి, రాగం వీరభద్రం, శివ, వర్మ, పద్మావతి, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఓ. జ్యోతి, మాజీ కేసీఎఫ్ సెక్రటరీ శంకర్‌నాయక్, టీఎన్టీవోల సంఘం జిల్లా అద్యక్షులు వడ్డెబోయిన శ్రీనివాస్, మహంకాళి వెంకటేశ్వర్లు, ప్రవీణ్, వ్యాయామ ఉపాద్యాయులు, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య, మా అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు, కాళోజీ, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.