హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అన్ని మతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేసే నిజమైన, ఆచరణాత్మక లౌకిక పార్టీ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఇతర పార్టీలకు చెందిన నలభై మంది మహిళా కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో ఆదివారం నాడు చేరారు. అజంపూర పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ. బిఆర్‌ఎస్ నాయకుడు రజా అలీ మీర్జా ఆధ్వర్యంలో పాత నగరంలోని కాంగ్రెస్, ఇతర పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పథకాలన్నీ తెలంగాణ ప్రభుత్వంలోనే ఉన్నాయని, అవన్నీ అమలు చేస్తున్నామని, ఈ ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన లౌకికవాదానికి దేశవ్యాప్తంగా పేరుగాంచారని, తెలంగాణ ఏర్పా టైనప్పటి నుంచి రాష్ట్రం రోజురోజుకూ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు .గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ అభివృద్ధిని సాధించిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు స్కాలర్‌షిప్‌ల పేరుతో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అందించారని, కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని నిరంతరం పెంచుతూనే ఉన్నారన్నారు .వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులకు , దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమని తెలిపారు.
వాస్తవాలు లేని గుజరాత్ మోడల్‌ను కొంతమంది ప్రచారం చేస్తున్నారని, గుజరాత్ ప్రజలు ఉపాధి, విద్యుత్, నీరు మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని హోంమంత్రి అన్నారు. ఇక అక్కడి ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని.. దేశంలోనే ఏ రాష్ట్రమైనా మోడల్‌గా ఉంటే అది తెలంగాణ రాష్ట్రమేనని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్లుగా అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే తెలంగాణా ప్రజలకే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలకూ ఎంతో అభిమానం ఉందన్నారు .దేశ వ్యాప్తంగా ప్రజల చూపు కెసిఆర్‌పైనే ప్రధానమంత్రిగా ఉందని తెలిపారు. తెలంగాణ రైతులకు కెసిఆర్ అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలను ఇతర పార్టీల నేతలు చూసి ఆశ్చర్యపోతున్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత నీరు, దీంతో పాటు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్ షిప్, షాదీముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్, సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర పథకాలను సవివరంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు లయఖ్ అలీ, నర్జీస్ బాను, ఫాతిమా అక్బర్, నాదర్ బేగం తదితరులు పాల్గొన్నారు.