బెంగళూరు : జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టిన తరువాత దాని లోపలి నుంచి ప్రగ్యాన్ రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. దీనిపై ఇస్రో స్పందించి “చంద్రుడిపై భారత్ నడిచింది” అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. “ చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సాఫీగా బయటకు వచ్చింది. దాంతో భారత్ చంద్రుడిపై నడిచింది ” అని అర్థం వచ్చేలా ఇస్రో ట్వీట్ చేసింది.
ఇస్రో బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు
ప్రగ్యాన్ రోవర్ విజయవంతంగా ల్యాండర్ నుంచి బయటకు రావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. “విక్రమ్ ల్యాండింగ్ అయిన తరువాత కొన్నిగంటలకు ప్రగ్యాన్ బయటకు రావడం చంద్రయాన్ 3 మరో దశ విజయాన్ని సూచిస్తుంది. చంద్రునిపై మన అవగాహనను ప్రగ్యాన్ సుసంపన్నం చేస్తుందన్న సమాచారం తెలుసుకుని తాను తోటి పౌరులు, శాస్త్రవేత్తలతో కలిసి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను ” అని ద్రౌపదీ ముర్ము వెల్లడించారు. అంతకు ముందు ఇస్రో ప్రకటించిన దాని ప్రకారం ల్యాండర్‌లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ల్యాండర్ ( విక్రమ్ ), రోవర్ (ప్రగ్యాన్) మొత్తం బరువు 1752 కిలోలు.
చంద్రునిపై ఒక రోజు (భూమిపై 14 రోజులతో సమానం ) పనిచేయడమే కాక, మరో రోజు కూడా పనిచేసే సాధ్యాసాధ్యాలను తోసిపుచ్చలేమని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. ల్యాండర్, రోవర్ ఈ రెండిటికీ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికి వేర్వేరు పేలోడ్‌లు ఉన్నాయి. రోవర్ తన పేలోడ్స్ ఎపిఎక్స్‌ఎస్ ( ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ ద్వారా చంద్రుని ఉపరితల భౌగోళిక స్వభావాన్ని సమగ్రంగా తెలుసుకోడానికి ఉపరితలంపై ఉన్న రసాయన సమ్మేళనాన్ని, ఖనిజపరమైన సమ్మేళనాన్ని కనుగొంటుంది. ప్రగ్యాన్‌కు కూడా మరో పేలోడ్ లాసర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్‌ఐబిఎస్) అమర్చి ఉంది. దీనిద్వారా చంద్రునిపై దిగిన పరిసరాల్లోని మట్టి, శిలల్లో మూలకాలు ఏవేవి ఇమిడి ఉన్నాయో కనుగొనగలుగుతుంది. ఈ ప్రయోగాలన్నీ చంద్రునిపై ఒక రోజు లోనే ఒకదాని తరువాత ఒకటి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.