Wednesday, January 22, 2025

రోవర్ ప్రజ్ఞాన్ 100 నాటౌట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిపై ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ 100 నాటౌట్‌గా నిలిచింది. ఓ వైపు శనివారం ప్రతిష్టాత్మక ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం విజయవంతం అయిన దశలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు. ఈ దశలోనే చంద్రయాన్ 3 ప్రయోగం సజావుగా ఉందని, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై విజయవంతంగా 100 మీటర్ల దూరం తిరుగాడిందని తెలిపారు. చంద్రుడిపై కీలకమైన ప్రయోగాల దిశలో ఇది అత్యంత విశిష్టమైన ప్రక్రియ అయింది. రోవర్ ఇప్పుడు వంద మీటర్ల ప్రయాణం సాగించింది. ఇప్పటికీ అలుపు సొలుపు లేకుండా పనిచేస్తోందని ఇస్రో తరఫున ట్వీటు వెలువరించారు. ప్రజ్ఞాన్ 100* అని సంబోధించారు. చంద్రుడి ఉపరితల ఫోటోలను ఎప్పటికప్పుడు రోవర్ పంపిస్తోంది. ఇక్కడ పలు రకాల ఖనిజాలు, మూలకాలు, ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని కూడా ఇప్పటివరకూ సాగించిన చంద్రయాన్ 3 అధ్యయనంలో వెల్లడైంది. ఇక హైడ్రోజన్ ఆనవాళ్లు కూడా కనుగొంటే చంద్రుడిపై మనిషి ఉండేందుకు వీలుంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా అత్యంత విలువైన ఖనిజాలను గుర్తించినట్లు అయితే ఇది భూగోళంలోని మానవాళి చరిత్రను మలుపు తిప్పుతుంది.

ఇక విక్రమ్ విశ్రామం, ప్రజ్ఞాన్ నిద్ర ః సోమనాథ్
చంద్రుడిపై ఇప్పుడున్న పగటిపూట దశ ముగుస్తు ఉండటంతో ఇక రోవర్, ల్యాండర్‌లు నిద్రావస్థలోకి వెళ్లుతాయని ఈ ప్రక్రియ వచ్చే ఒక్కటి రెండు రోజులలో ఆరంభం అవుతుందని ఇస్రో ఛైర్మన్ శనివారం తెలిపారు. ఈ నెల 7వ తేదీ దరిదాపుల్లో చంద్రమండలం చీకటి దశకు చేరుకుంటుంది. ఇది 14 రోజుల పాటు ఉంటుంది. పగటిపూట కాంతితోనే ల్యాండర్ రోవర్‌లు పనిచేస్తూ ఉంటాయి. తరువాత ఇవి పనిచేయడం ఆగిపోతుంది. తరువాతి పగటి దశ వచ్చే వరకూ ఇవి పూర్తిగా అంతరించి పోకుండా ఉంటే తిరిగి వీటిని పగటిపూట కాంతితో పునరుజ్జీవం చేయించవచ్చు. దీనితో తిరిగి చంద్రుడిపై వీటి అన్వేషణలకు వీలేర్పడుతుందని ఇస్రో వర్గాలు ఆశిస్తున్నాయి. అంతరిక్షం ఇప్పుడు గ్లోబల్ బిజినెస్‌గా మారిన దశలో చంద్రయాన్ 3 దశలో పరీక్షల ఫలితాలు భారతదేశానికి ఎంతగానో దోహదపడుతాయి. ఈ దిశలో ఇప్పటివరకూ ల్యాండర్, రోవర్ పంపించిన సంకేతాలు , సమాచారం అత్యంత కీలకమైనదిగా భావించాల్సి ఉంటుందని ఇస్రో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News