న్యూఢిల్లీ: ఒక అనాథకు తన మూత్రపిండాన్ని దానం చేసిన కోల్‌కతాకు చెందిన ఒక మహిళకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆత్మీయ అభినందనలు లభించాయి. ఆమె నిస్వార్థ సేవను కీర్తించడానికి మాటలు సరిపోవడం లేదని ప్రధాని తన అభినందన లేఖలో పేర్కొన్నారు.
అవయవ దానాన్ని మహాదానంగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసంతో స్ఫూర్తి చెంది 2014లో తన మూత్ర పిండాన్ని దానం చేశానని కోల్‌కతాకు చెందిన 48 సంవత్సరాల మనాసి హైదర్ తెలిపారు. కొద్ది నెలల క్రితమే ఈ విషయాన్ని ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలిపానని, వెంటనే ఇందుకు స్పందనగా ప్రధాని నుంచి అభినందనలతో కూడిన లేఖ అందిందని ఆమె తెలిపారు.
ఒక విలువైన ప్రాణాన్ని కాపాడేందుకు మీ మూత్ర పిండాన్ని దానం చేయడమన్నది చాలా ఉదాత్తమైన చర్యని, మీ నిస్వార్థ సేవను ప్రశంసించడానికి మాటలు సరిపోవని ప్రధాని ఆమెకు రాసిన లేఖలో కీర్తించారు. త్యాగనిరతి, పరోపకారం అన్నవి మన ఘన సంస్కృతి, సంప్రదాయాలలో కీలకమైనవని ఆయన అన్నారు. అవయవ దానం అత్యున్నతమైన దానమని, దీనివల్ల అవయవ స్వీకర్తకు కొత్త జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. అవయవ దానాన్ని ప్రజా ఉద్యమంగా మలచడానికి తాము సమష్టిగా చేపడుతున్న ప్రజా అవగాహనా కార్యక్రమాలు కచ్ఛితంగా సత్ఫలితాలు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా, తాను, తన నుంచి మూత్ర పిండం దానం తీసుకున్న వ్యక్తి ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నామని హైదర్ తెలిపారు.