దుబాయి: ఐసిసి టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. అతడివల్లే జట్టు ఓడిందని విమర్శించారు. మరి కొందరైతే మరో అడుగు ముందుకు వేసి భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడంటూ ట్రోల్ చేశారు. షమీపై నెటిజన్ల వ్యాఖ్యలను పలువురు మాజీ క్రికెటర్లు అప్పడే ఖండించారు. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఈ ట్రోల్స్‌పై స్పందించాడు. మతం పేరుతో దూషించడం చాలా నీచమైన పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో దూషించే వారిని చూస్తే జాలేస్తుందని కోహ్లీ అన్నాడు.
వెన్నెముక లేని వారే ఇలా మతాన్ని టార్గెట్ చేసుకుంటారని అన్నాడు. దేశంపై షమీకి ఉన్న అంకిత భావం ఏంటో అందరికీ తెలుసునని, మరోసారి నిరూపించుకోవలసిన అవసరం లేదన్నాడు. షమీ గురించి తెలియని వారే ఇలాంటివి చేస్తుంటారని, ఎవరెన్ని విమర్శలు చేసినా తమ సోదర భావాన్ని చెడగొట్టలేరని తేల్చి చెప్పాడు. షమీకి 200 శాతం మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. కోహ్లీ తాజా వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు పర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ఇషాన్ ఖట్టర్, ఆనంత్ ఆహుజా, షిబానీ దండేకర్, హర్షవర్ధన్ కపూర్, స్వరా భాస్కర్ తదితరులు షమీకి అండగా నిలవడమే కాకుండా షమీకి మద్దతు ప్రకటిస్తూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ప్రశంసలు కురిపించారు.