Saturday, November 16, 2024

అదరగొడుతున్న వెల్లలాగే..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియాకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆటగాడు దునిత్ వెల్లలాగే అసాధారణ ఆటతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో వల్లలాగే కీలక పాత్ర పోషించాడు. అంతేగాక బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత బౌలర్లను హడలెత్తించాడు. ఒకదశలో అతని బ్యాటింగ్ తీరును గమనిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి తప్పదా అనిపించింది. లంకతో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు.

ఇద్దరు అద్భుతంగా ఆడడంతో భారత్ 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఓపెనర్ల దూకుడును చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా స్కోరు 350 పరుగులు దాటడం ఖాయం గా కనిపించింది. అయితే సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌ను లంక యువ స్పిన్నర్ వెల్లలాగే కోలుకోలేని దెబ్బతీశాడు. స్పిన్ ఆడడంలో ఎంతో నైపుణ్యం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కూడా వెల్లలాగే బంతులను ఎదుర్కొవడంలో తడబడ్డారు.

దీన్ని బట్టి అతని బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 20 ఏళ్ల వెల్లలాగే లంకకు లభించిన సరికొత్త ఆయుధంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వనిందు హసరంగ గాయపడడంతో వెల్లలాగేకు ఆసియాకప్‌లో ఛాన్స్ లభించింది. ఈ అవకాశాన్ని అతను రెండు విధాలుగా అందిపుచుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా అజేయంగా 33 పరుగులు చేసి లంకను సూపర్4కు చేర్చడంలో ముఖ్యభూమిక పోషించాడు. మరోవైపు వెల్లలాగేపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. లంకతో పాటు భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News