Friday, November 22, 2024

అధిక ధరలకు ప్రజా పాలన దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచని అధికారులు
ముందుగా వచ్చిన వారికి పంపిణీ చేసిన జీహెచ్‌ఎంసి సిబ్బంది
ఈ కార్యక్రమం నెల రోజులు పొడిగించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా పాలన పథకం దరఖాస్తులు మీ సేవ కేంద్రాల్లో రూ. 60 కు విక్రయిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన కార్యక్రమంను నెల రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది పథకాల కోసం దరఖాస్తు చేసేందుకు వస్తే కేంద్రాల్లో సరిపడ దరఖాస్తులు అందుబాటులో పెట్టడం లేదని మండిపడ్డారు. దరఖాస్తులను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులు దొరక్క పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగిన ప్రచారం చేయలేదని, రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం ఫామ్‌లో ఎలాంటి వివరాలు లేవని రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం తెల్లకాగితంపై రాసి ఇవ్వాలని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు.

తన నియోజకవర్గంలో 24 ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారని, అక్కడ కేవలం 100 నుంచి 150 వరకు ప్రజాపాలన దరఖాస్తులు పెడుతున్నారని ముందు వచ్చిన వారికే దొరుకుతున్నాయని, మిగతా వారు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులు నిర్వహించిన సమావేశంలో ఎదురయ్యే పరిస్ధితులను వివరించినా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలకు ఏ కేంద్రంలోకి వెళ్లాలి, ఏ తేదీలో వెళ్లాలని సమాచారం ఇవ్వాలని ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రక్రియ ఈవిధంగా కొనసాగితే ప్రజలందరికి దరఖాస్తులు లభించడం కష్టమన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై ముందుగానే ప్రజలకు అవగాహన చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News