అమరావతి: చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ప్రజాగళం సభ జరగనుంది. చిలకలూరిపేట సభలో ఎపి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు టిడిపి, జనసేన, బిజెపి యుద్ధభేరి మోగించనుంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు హాజరుకానున్నారు. పది సంవత్సరాల తరువాత ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్ కన్పించనున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు కాయమయ్యాక తొలి ఎన్నికల సభ జరుగునుంది. ఆదివారం సాయంత్రం 5.20 గంటలకు సభా ప్రాంగణానికి ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ప్రధాని సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని ఎన్‌ఎస్‌జి బృందం అధీనంలోకి తీసుకుంది. ఐదు వేల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.
ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ తదితర నేతల కోసం 7 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట సభకు 300 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్‌తో పాటు మరో 27 మంది ఆశీనులుకానున్నారు. ఈ సభకు పది లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును పార్టీల అధినేతలు వివరించనున్నారు. ప్రజాగళం సభకు టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు భారీగా తరలివెళ్తున్నాయి. వివిధ జిల్లాల నుంచి చిలకలూరిపేటకు బైకులు, కార్లతో ర్యాలీగా కార్యకర్తలు వెళ్తున్నారు. కూటమి పంతం-వైసిపి అంతం అంటూ నినాదాలు చేస్తున్నారు.