కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయంటూ కొందరు సోషల్ మీడియాలో షేర్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమం ఈనెల 6వ తేదీన ముగియడంతో ప్రభుత్వం.. దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో దరఖాస్తులను ఆఫీసులకు తరలించేందుకు ప్రభుత్వం ర్యాపిడో బైక్‌ల సేవలను వినియోగించుకుంటోందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా హయత్ నగర్ సర్కిల్ పరిధిలో దాఖలైన దరఖాస్తులను ర్యాపిడో బైక్ పై తరలిస్తుండగా.. బాలానగర్ ఫ్లైఓవర్ పై బైక్ స్కిడ్ కావడంతో దరఖాస్తులు కింద పడిపోయాయి. దీంతో వాహనదారులు వాటిని ఎగిరిపోకుండా పట్టుకుని ర్యాపిడో బైకర్ కు అప్పగించారు. అయితే, కొందరు కిందపడిన దరఖాస్తులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.