రుద్రంగి: మండల ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి.
కానీ ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యల కోసం దరఖాస్తు చేసుకుందామంటే అధికారులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు, రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే తక్కువ సమయంలోనే అట్టి సమస్యలు కలెక్టర్, ఉన్నతాధికారుల ద్వారా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో కార్యాలయానికి వస్తే అధికారులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఒక్క అంగన్‌వాడీ శాఖకు సంబంధించిన అధికారి రావడం కొసమెరుపు.
రుద్రంగి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నామమాత్రంకే నిర్వహిస్తున్నారని అధికారులు ఒక్కరు కూడా ప్రజావాణి కార్యక్రమంలో హాజరు కాకపోవడంతో రైతులు చివరికి దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. తక్షణమే కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.