Sunday, January 19, 2025

ఎప్పుడొచ్చినా.. ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్ అరెస్టు: కర్నాటక హోంమంత్రి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సెక్స్‌ వీడియోల నిందితుడు, జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ ఎప్పుడొస్తే అప్పుడు బెంగళూరు విమానాశ్రయంలోనే అరెస్టు చేసేస్తామని కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర చెప్పారు. పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, అత్యాచారాల వీడియోలు వెలుగులోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలోనే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లాడు. తాను ఈ నెలాఖరున తిరిగి వస్తున్నట్లు, సిట్ విచారణకు హాజరుకానున్నట్లు వీడియో సందేశం వెలువరించాడు. ఈ విషయంపై రాష్ట్ర హోం మంత్రి బుధవారం ఇక్కడ స్పందించింది. ఈ రెండు రోజులలో ప్రజ్వల్ బెంగళూరుకు వస్తున్నట్లు తెలసింది.

ఈ నెల 30వ తేదీన ఆయన జర్మనీలో మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. మరుసటి రోజు 31వ తేదీన తెల్లవారుజామున బెంగళూరుకు వస్తున్నారు. ఇవన్నీ తమకు వయా మీడియా తెలిసిన విషయాలని హోం మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా అరెస్టు వారంటు వెలువరించారు. సిట్ ఆయనను విచారించాల్సి ఉంది. కాబట్టి ఆయన ఇక్కడ దిగగానే ముందుగా అదుపులోకి తీసుకునేందుకు సిట్ రంగం సిద్ధం చేసుకుందని విలేకరులకు పరమేశ్వర తెలిపారు. అరెస్టుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అరెస్టు చేయడం, విచారణకు తీసుకువెళ్లడం, స్టేట్‌మెంట్ తీసుకోవడం జరుగుతుందని వివరించారు. చట్ట ప్రకారం సిట్ తన పనితాను చేసుకువెళ్లుతుందన్నారు.

జెడిఎస్ వ్యవస్థాపక నేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ సిఎం కుమారస్వామి అన్నకొడుకు అయిన 33 సంవత్సరాల ప్రజ్వల్ ఇటీవలి ఎన్నికల్లో కర్నాటకలోని హసన్ ఎంపి స్థానం నుంచి ఎన్‌డిఎ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని ఇందులో ఎవరు దోషులని తేలినా కఠిన చర్యలు ఉంటాయని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే 11 నుంచి 12 మందిని అరెస్టు చేశారని తెలిపారు. ఇది ఇలా ఉండగా బెంగళూరులో శుక్రవారం ఉదయం వస్తున్న రేవణ్ణను అరెస్టు చేసేందుకు సిట్ బృందం ఒకటి ఇప్పటి నుంచే బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో నిఘా పెట్టింది.

అరెస్టు నివారణకు ప్రజ్వల్ పిటిషన్: తోసిపుచ్చిన కోర్టు
తనకు యాంటిసిపేటరి బెయిల్ మంజూరు చేయాలని ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. ఆయన తరుఫు న్యాయవాది వాదనలు విన్పించారు.అయితే ఈ పిటిషన్‌ను పరిశీలన తరువాత ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ముందు ఈ విషయంపై సిట్ వివరణ కోరుతామని, విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేస్తామని తెలిపింది. అయితే ప్రజ్వల్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఆ తరువాత తెలిపింది. దీనితో బెంగళూరుకు చేరుకోగానే ఆయన అరెస్టుకు ఇప్పుడు సిట్‌కు వీలేర్పడింది.

అత్యవసర ప్రాతిపదికన రూలింగ్‌కు ప్రజ్వల్ అభ్యర్థించారు. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ పిటిషన్‌పై స్పందించింది.కుదరదని తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివరణకు నోటీసులు వెలువరించింది. దీనిపై వారి అభ్యంతరాలుంటే తెలియచేయాలని తెలిపింది. గురువారం కేసు విచారణ జరగాలని ఎంపి తరఫు లాయరు కోరారు. అయితే తమ వివరణకు కొంత సమయం అవసరం అని సిట్ తెలిపింది. దీనితో కేసు విచారణను ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజే ప్రజ్వల్ విదేశాల నుంచి బెంగళూరుకు వస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News