మహారాష్ట్రలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంచిత్ బహుజన్ అఘాడి (విబిఎ) వ్యవస్థాపకుడు ప్రకాశ్ అంబేద్కర్ మరాఠా రిజర్వేషన్ ప్రచారోద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్‌తో చర్చల అనంతరం మూడవ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)కు దూరం జరిగారు. అంబేద్కర్ ముంబయిలో ‘ఇండియా’ కూటమి ర్యాలీకి హాజరైన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది. ముంబయి ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించగా వాయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ, ప్రతిపక్ష కూటమి నేతలు కొందరు హాజరయ్యారు.
అంబేద్కర్ కొన్ని వారాలుగా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతోను, ఎన్‌సిపి (ఎస్‌సిపి) చీఫ్ శరద్ పవార్‌తోను, శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్కరేతోను చర్చలు జరుపుతున్నారు. తుదకు అంబేద్కర్ ఈ నిర్ణయం తీసుకుని తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. అంబేద్కర్ స్వయంగా మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలా నుంచి పోటీ చేస్తారు. విబిఎ రాష్ట్ర కమిటీ నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ థాక్రేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అంబేద్కర్ అకోలాలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, తాను ఒక రోజు క్రితం జల్నాలో జరాంగే పాటిల్‌తో సమగ్రంగా సంప్రదింపులు జరిపినట్లు తెలియజేశారు. ఇతర ప్రధాన పార్టీలు నామినేట్ చేయని ఒబిసి, ముస్లింఅభ్యర్థులను నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.