హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీతో బిజెపి ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఎన్‌డిఎలో చేరుతామని కోరగా.. అందుకు తిరస్కరించినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలతోనే స్పష్టమవుతోంది. బిఆర్‌ఎస్‌తో ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదని అన్నారు.
కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు గతంలో కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కెసిఆర్ పనిచేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు.. బిఆర్‌ఎస్ లో చేరారు. కాంగ్రెస్ బిఆర్‌ఎస్ ఒకే తానుముక్కలు. ఎన్డీయేలో చేరేందుకు అంగీకరించని కారణంగా.. ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు స్వాగతం పలికేందుకు కూడా ముఖ్యమంత్రి రావడం లేదు. తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీయే.. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి తీరుతాం అని ఆయన స్పష్టం చేశారు.