కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శశి థరూర్ మరోసారి విజయం సాధిస్తారని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి శశి థరూర్ ద్వారా తిరువనంతపురం నియోజకవర్గం ఎంతో ప్రయోజనం పొందినట్లు తాను తెలుసుకున్నానని, మళ్లీ ఆయనకే ఈ స్థానం దక్కుతుందని ప్రకాష్ రాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మంచి మిత్రుడన్న కారణంతో తాను ఇక్కడకు రాలేదని, గడచిన దశాబ్ద కాలంగా ఆయన తనకు ఇచ్చిన నమ్మకం, సంతోషం కారణంగానే ఆయనకు అండగా నిలబడేందుకు తాను వచ్చానని తెలిపారు.
ఈ నియోజకవర్గం నుంచి ఆయన తన బలమైన వాణిని దేశానికి వినిపిస్తున్నారని ప్రకాష్ రాజ్ చెప్పారు. తిరువనంతపురంలో శశి థరూర్ కేంద్ర మంత్రి, బిజెపి అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్, సిపిఐ అభ్యర్థి పన్నియన్ రవీంద్రన్‌తో త్రిముఖ పోటీని ఎదుర్కొంటున్నారు. 2009 నుంచి ఈ స్థానంలో శశి థరూర్ గెలుపొందుతున్నారు. సిపిఐ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం అయినప్పటికీ కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్నది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవశం చేసుకోగా సిపిఎం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. బిజెపి బోణీ కొట్టలేదు.