‘మా’ ఎన్నికలు ముగిసి వారం గడిచినా ఆ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఓటమి పాలైన ప్రకాశ్‌రాజ్ ’మా’ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా తమ ప్యానల్ సభ్యులపై దాడులు జరిగాయని చెప్పారు. సిసి కెమెరాలు అన్నింటిలో ఇవి రికార్డయి ఉంటాయని భావిస్తున్నామని.. అందుకే సిసిటివి ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల అధికారికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సిసిటివి ఫుటేజ్ భద్రంగా ఉందని.. నిబంధనల ప్రకారం దాన్ని ఇస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సిసిటివి
ఫుటేజ్ రూమ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ‘మా’ ఎన్నికల పోలింగ్ సిసిటివి ఫుటేజీని ప్రకాశ్ రాజ్ పరిశీలించారు. తన ప్యానెల్ సభ్యులైన బెనర్జీ, – తనీష్‌లతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు వచ్చారు. పోలీసుల సమక్షంలో సిసిటివి ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ “అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్ సెంటర్ లో ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలించాం. ఇంకా ఎన్నికల అధికారి వద్ద ఏడు కెమెరాల ఫుటేజీ ఉంది. దానిని కూడా పరిశీలించిన తర్వాత మేము మీడియా ముందుకు వస్తాం. సిసిటివి ఫుటేజీ పరిశీలించడానికి అంగీకారం తెలిపిన మంచు విష్ణుకి ధన్యవాదాలు.
మాకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే ఇబ్బందులున్నాయి. ఫుటేజీ ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఆయనకు లేఖ రాశాను. మొదట ఆయన ఓకే అన్నారు. కానీ ఆ తర్వాత ఫుటేజీ ఇవ్వడం కుదరదు.. దానికంటూ ఓ ప్రోటోకాల్ ఉంటుందని ఆయన అన్నారు” అని చెప్పారు. ఇకపోతే ‘మా’ సిసిటివి ఫుటేజీ వివాదంపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ‘మా’ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం వరకే తన బాధ్యత అని.. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఏం జరిగినా తనకు సంబంధం లేదని అన్నారు. సిసిటివి ఫుటేజీ కావాలంటే కోర్టుకు వెళ్లాలని.. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని తెలిపారు.