ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగింపు
పణాజీ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు. 40 స్థానాలు గల గోవాఅసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి 20 స్థానాలు గెలుచుకోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 21 స్థానాల బలం అవసరమవుతుంది. అందుకోసం ముగ్గురు ఇండిపెండెంట్లతోపాటు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి సన్నద్ధమవుతోంది. శనివారం మధ్యాహ్నం గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లైను రాజ్‌భవన్‌లో కలుసుకున్న సావంత్ తన రాజీనామా లేఖను అందచేశారు. అనంతరం గవర్నర్ శ్రీధరన్ విలేకరులతో మాట్లాడుతూ సావంత్ రాజీనామాను ఆమోదించానని తెలిపారు. అంతేగాక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా సావంత్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.