సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ పోరాడి ఓడాడు. చైనా షట్లర్ వాంగ్ హాంగ్ యాంగ్‌తో జరిగిన పోరులో ప్రణయ్ పరాజయం చవిచూశాడు. ఉత్కంఠభరితంగా సాగిన తుది సమరంలో వాంగ్ 219, 2123. 2220 తేడాతో ప్రణయ్‌ను ఓడించాడు.
తొలి సెట్లో వాంగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రణయ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. అతని ధాటికి ప్రణయ్ ఎదురు నిలువలేక పోయాడు. దూకుడుగా ఆడిన వాంగ్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే తర్వాతి సెట్‌లో ప్రణయ్ పుంజుకున్నాడు. వాంగ్ జోరుకు బ్రేక్ వేస్తూ ముందుకు నడిచాడు. ఇటు వాంగ్ అటు ప్రణయ్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు.
దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే చివరికి సెట్ మాత్రం ప్రణయ్‌కు దక్కింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఆసక్తిగా సాగింది. ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడడంతో హోరాహోరీ తప్పలేదు. అయితే చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన వాంగ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత స్టార్ ప్రణయ్ విజయం కోసం ఆఖరు వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో ఓడడంతో ప్రణయ్‌కు రన్నరప్ లభించింది. ఈ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి షట్లర్లు పోటీ పడ్డారు.