Monday, December 23, 2024

గణాంక పితామహుడు

- Advertisement -
- Advertisement -

ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంక శాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి. మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందినాడు. ఆయన గణాంక కొలత అయిన ‘మహలనోబిస్ డిస్టెన్స్’ ద్వారా గుర్తింపబడ్డాడు. భారత దేశ మొదటి ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాడు.1893 జూన్ 29న కోల్‌కతాలో జన్మించిన మహలనోబిస్ భౌతిక శాస్త్రంలో శిక్షణ పొంది, అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పని చేసి పదవీ విరమణ చేశాడు. అతనికి గణాంక శాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆ రంగంలో నైపుణ్యం సాధించి చివరికి ఆ రంగంలోనే జగత్ప్రసిద్ధి చెందినాడు. గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్ లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు.

1946లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమిషన్ సభ్యుడిగా, 1949లో కేంద్ర మంత్రివర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహాదారుడిగా నియమించబడ్డాడు. 1950లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపనలో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు.1949 జాతీయాదాయ కమిటీ చైర్మెన్‌గా మహలనోబిస్ జాతీయాదాయ గణాంకాలకు ప్రాతిపదిక స్వరూపాన్ని ఇచ్చాడు. 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధిగాంచింది. మహలనోబిస్ పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. ఆయన పూర్వీకుల స్వస్థలం నేటి బంగ్లాదేశ్ ప్రాంతం. జీవనోపాధి కోసం మహలనోబిస్ తాత కోల్‌కత ప్రాంతానికి చేరి స్థిరపడ్డాడు. మహలనోబిస్ బాల్యం, విద్యాభ్యాసం కూడా కోల్‌కతలోనే కొనసాగింది.1912లో భౌతిక శాస్త్రం (ఆనర్స్)లో పట్టభద్రుడయ్యాడు.

తర్వాత కేంబ్రిడ్జి, కింగ్స్ కళాశాలలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం అభ్యసించాడు. అభ్యసనం పూర్తి కాగానే మహలనోబిస్ కోల్‌కతలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా ప్రవేశించాడు. 30 సంవత్సరాల పాటు సేవలందించి ఆయన ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యాడు. ప్రెసిడెన్సీ కళాశాల అధ్యాపకులుగా ఉన్నపుడే గణాంక శాస్త్రజ్ఞుడిగా ప్రసిద్ధి చెందినాడు. ఆయన గణాంక శాస్త్రంలో చేసిన సేవలకు గుర్తింపుగా 1945లో లండన్ లోని రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యాడు. 1946లో ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ సభ్యుడిగా నియమించబడ్డాడు. 1949లో కేంద్ర మంత్రివర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహాదారుడిగా నియమించబడ్డాడు. దీనితో దేశానికి ఆర్థిక, గణాంక సేవలందించడానికి అతనికి అవకాశం లభించింది. 1950 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష ఉపన్యాసంలో జాతీయ ప్రణాళిక విధానంలో గణాంక శాస్త్రం అంతర్భాగమని పేర్కొన్నాడు. భారతీయ గణాంక సంస్థ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్) స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు.

స్థూల జాతీయోత్పత్తి, సంబంధిత ఇతర అంశాలను అంచనా వేయడం ఈ సంస్థ బాధ్యత. జాతీయాదాయ కమిటీ చైర్మెన్‌గా మహలనోబిస్ జాతీయాదాయ లెక్కలకు ప్రాతిపదిక స్వరూపాన్ని రూపొందించారు. 1933లో భారత గణాంక శాస్త్ర పత్రిక సాంఖ్య ప్రచురణను ఆయన ప్రారంభించాడు. 1940 లలో శాంపిల్ సర్వే మీద ఆయన సాగించిన పరిశోధనల ఫలితంగా 1950లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపితమైంది. సోవియట్ యూనియన్ ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టున దశలో పిసి మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించాడు. 1950 లో ప్రణాళిక సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించాడు.

1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించబడ్డాడు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పిసి మహలనోబిస్ పాత్ర ప్రధానమైది. ఇది మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధి చెందినది. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించాడు. ఈయనకు 1944 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ మెడల్ పురస్కారం లభించింది. 1945లో లండన్‌లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ సభ్యత్వం అందుకున్నారు. 1957లో అంతర్జాతీయ గణాంక సంస్థ గౌరవ అధ్యక్షుడిగా హోదా పొందాడు. 1968లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహలనోబిస్ 1972 జూన్ 28న మరణించారు.

జెవి ప్రమోద్ కుమార్, 9490833108

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News